గచ్చిబౌలిలో వకీల్ సాబ్ షురూ… హీరోయిన్ అంజలి కూడా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా వకీల్ సాబ్ షూటింగ్ నిన్నటి నుండి తిరిగి మొదలైంది. లాక్ డౌన్ కు ముందు వకీల్ సాబ్ మెజారిటీ పార్ట్ షూటింగ్ పూర్తైపోయిన విషయం తెల్సిందే. మరో 30 రోజులు షూటింగ్ బ్యాలన్స్ ఉంది. ఇక సినిమాలు అన్నీ ఒక్కొక్కటే షూటింగ్స్ కు వెళుతోన్న నేపథ్యంలో వకీల్ సాబ్ కూడా షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టేశాడు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో షూట్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ మొత్తం నైట్ టైమ్ జరుగుతుందని తెలుస్తోంది.

వకీల్ సాబ్ లో కీలక పాత్రలు పోషిస్తున్న అంజలి, నివేతా థామస్, అనన్యలు ఈ షెడ్యూల్ లో పాల్గొంటారు. హీరోయిన్ అంజలి మీద ప్రస్తుతం షూట్ జరుగుతోంది. అయితే ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ అవ్వట్లేదు. అక్టోబర్ రెండో వారం నుండి పవన్ కళ్యాణ్ షూట్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

శృతి హాసన్ ఈ సినిమాలో పవన్ సరసన నటిస్తోంది. టైటిల్ సూచిస్తున్నట్లు గానే ఇందులో పవన్ లాయర్ పాత్రలో కనిపిస్తాడు. సమాజంలో నాటుకుపోయిన ఒక రుగ్మతపై ఈ సినిమా బేసిక్ ప్లాట్ ఉంటుంది. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. థమన్ సంగీత సారధ్యం వహిస్తున్నాడు. ఈ సినిమాలోని మగువా మగువా సాంగ్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.