ఆ మైలు రాయి చేరిన మొదటి సౌత్‌ ఇండియన్‌ హీరో విజయ్‌ దేవరకొండ

తక్కువ సినిమాలతోనే విజయ్‌ దేవరకొండ యూత్‌ ఐకాన్‌ గా మారిపోయాడు. అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో తెలుగు యూత్‌ ఆడియన్స్‌లో సూపర్‌ స్టార్‌ క్రేజ్‌ను దక్కించుకున్న ఈ రౌడీ స్టార్‌ ఇతర భాషల ప్రేక్షకుల్లో కూడా మంచి ఫాలోయింగ్‌ను సంపాదించాడు. ఆ ఫాలోయింగ్‌ తోనే తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ సంఖ్య సౌత్‌ ఇండియాలోనే ఏ స్టార్‌ హీరో దక్కించుకోని స్థాయిలో పెంచుకున్నాడు. తాజాగా 80 లక్షల మంది ఫాలోవర్స్‌ ను ఇన్‌ స్టాగ్రామ్‌ లో దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ అరుదైన మైలు రాయి దాటాడు.

ఇప్పటి వరకు ఏ సౌత్‌ ఇండియన్‌ నటుడు ఈ స్థాయిలో ఇన్‌ స్టా ఫాలోవర్స్‌ను దక్కించుకోలేదు. బాలీవుడ్‌ నటులకు మాత్రమే సాధ్యం అయిన ఈ స్థాయి ఫాలోవర్స్‌ విజయ్‌ దేవరకొండకు మాత్రమే దక్కింది అంటే ఆయన ఏ స్థాయిలో యూత్‌ ఆడియన్స్‌ను అట్రాక్ట్‌ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. తన సినిమాలతోనే కాకుండా తన అటిట్యూడ్‌ బాడీ లాంగ్వేజ్‌ తన మంచి మనసుతో ఫాలోవర్స్‌ మన్ననలు పొందుతున్నాడు.

గీత గోవిందం తర్వాత ఆ స్థాయి సక్సెస్‌ లేకున్నా కూడా విజయ్‌ దేవరకొండ స్టార్‌ డం మాత్రం పడిపోలేదు. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌.. డియర్‌ కామ్రేడ్‌ చిత్రాలు ఆయన అభిమానులను నిరాశ పర్చాయి. అయినా ప్రస్తుతం పూరితో చేస్తున్న సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మరో రెండు హిట్స్‌ పడి ఉత్తరాదిన కూడా ఈ రౌడీ స్టార్‌ కు గుర్తింపు వస్తే తక్కువ సమయంలోనే 10 మిలియన్‌ ల ఇన్‌ స్టా ఫాలోవర్స్‌ ను దక్కించుకున్న హీరోగా విజయ్‌ దేవరకొండ మరో రికార్డును కూడా దక్కించుకునే అవకాశం ఉంది.