రీమేక్‌ అప్‌డేట్‌ మెగాస్టార్‌ మూవీలో విజయశాంతి

మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసీఫర్‌ను తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి రీమేక్‌ చేయబోతున్నట్లుగా చాలా బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ విషయాన్ని కొట్టి వేయక పోవడంతో నిజమే అయ్యి ఉంటుందని అనుకుంటున్నారు. సుజీత్‌ దర్శకత్వంలో ఈ రీమేక్‌ ఉంటుందని సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు వర్షన్‌కు తగ్గట్లుగా పలు మార్పులు చేర్పులు చేస్తున్నారు.

రీమేక్‌ విషయంలో ఇప్పటి వరకు ఎన్నో పుకార్లు వచ్చాయి. కాని ఈ పుకారు మాత్రం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. లూసీఫర్‌ చిత్రంలో మంజు పాత్ర చాలా పవర్‌ ఫుల్‌గా ఉంటుంది. ఆ పాత్రను విజయశాంతితో చేయిస్తే బాగుంటుందనే అభిప్రాయంకు చాలా మంది వచ్చారు. లూసీఫర్‌ చిత్రం కథలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అందుకే లూసీఫర్‌ రీమేక్‌లోని ఆ పాత్ర కోసం విజయశాంతి అయితే బాగుంటుందని అనుకున్నారు. అంతా అనుకున్నట్లుగానే ఇటీవలే మేకర్స్‌ ఆమెను సంప్రదించారని పుకార్లు పుట్టుకు వస్తున్నాయి.

మెగాస్టార్‌ చిరంజీవి, విజయశాంతి ఇద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ సినిమాల్లో సూపర్‌ డూపర్‌ హిట్స్‌ చాలా ఉన్నాయి. మద్యలో రాజకీయాల కారణంగా వివాదాలు వచ్చినా సరిలేరు నీకెవ్వరు చిత్రం సమయంలో మళ్లీ వీరిద్దరు కలిశారు. ఆ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక సందర్బంగా విజయశాంతి, చిరంజీవిల మద్య జరిగిన సన్నివేశం మళ్లీ వీరిద్దరు కలిసి నటించే అవకాశం ఉందని చెప్పకనే చెబుతోంది. మరి లూసీఫర్‌ లో వీరిద్దరు కలిసి నటిస్తారా లేదా అనేది చూడాలి.