కులమత బేధాల్లేని సమాజం ఇలాగేనా రెడ్డిగారూ.!

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి ఓ ఆసక్తికరమైన ట్వీటేశారు. అఫ్‌కోర్స్‌, విజయసాయిరెడ్డిగారి ట్వీట్లను ‘కాకి రెట్ట’లతో వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు పోల్చుతున్నారనుకోండి.. అది వేరే సంగతి. పాఠశాలల్లోని హాజరు రికార్డుల్లో విద్యార్థుల కులం, మతం ప్రస్తావించకూడదని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై విజయసాయిరెడ్డి వేసిన ట్వీట్‌ ఇప్పుడు సంచలనంగా మారింది.

‘కుల మత బేధాలు లేని సమాజానికి తొలి అడుగు వేసిన ముఖ్యమంత్రి జగన్‌గారి దూరదృష్టికి సలాం’ అన్నది ఆ ట్వీట్‌ సారాంశం. దీన్ని ‘తొలి అడుగు’గా ఎలా అభివర్ణించగలం.? కులమత బేధాల్లేని సమాజం కోసం దశాబ్దాలుగా, ఎన్నో శతాబ్దాలుగా పోరాటాలు జరుగుతూనే వున్నాయి. ఎందరో మహనీయుల కృషితోనే, ఇప్పుడీ సమాజం ఇలా వుంది. దురదృష్టవశాత్తూ కొందరు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు.. కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీ ఇందుకు మినహాయింపేమీ కాదు.

వైసీపీ హయాంలో సలహాదారులు, నామినేటెడ్‌ పోస్టుల్లో ‘రెడ్డి’ సామాజిక వర్గానికే అగ్రపీఠం దక్కేలా చేస్తున్న విషయాన్ని ఎలా విస్మరించగలం.? ఇది కదా ‘కుల జాడ్యం’ అంటే.. అన్న విమర్శలున్నాయి. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, వైసీపీ కోటరీలో సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి.. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్‌ చాలానే వుంటుంది. అధికారుల్ని కూడా ‘రెడ్డి’ అనే కోణంలోనే ‘ప్రమోట్‌ చేస్తున్నారు’ అన్న విమర్శల సంగతి సరే సరి.

ఓట్లేసిన ప్రజలకేమో పప్పూ బెల్లం పథకాలు.. సొంత సామాజిక వర్గానికి చెందిన ‘ప్రముఖులకు’ మాత్రం, లక్షల్లో వేతనాలిచ్చి నామినేటెడ్‌ పోస్టులు.. దీన్ని కులమత బేధాల్లేని సమాజం.. అని ‘కవరింగ్‌’ ఇస్తే నమ్మేందుకు జనం ఏమైనా వెర్రి వెంగళప్పలా.? అన్నది సర్వత్రా వినిపిస్తోన్న విమర్శ. నామినేటెడ్‌ పోస్టులు, సలహాదార్లకు సంబంధించి ‘జనాభా ప్రాతిపదికన’ నియామకాలు జరిగినప్పుడు కదా, కుల మత బేధాల్లేని సమాజం.. అని అనుకోవడానికి వీలుంటుంది.!