150 ఛాన్స్.. వినాయక్‌కు ఎలా వచ్చింది?

మెగాస్టార్ చిరంజీవికి పరోక్షంగా ఏదో ఒక చురక అంటిస్తుంటాడు దర్శకరత్న దాసరి నారాయణరావు. కానీ అప్పుడప్పుడూ చిరంజీవిని పొగుడుతారు కూడా. ఈ నేపథ్యంలో శనివారం జరగబోయే ‘ఖైదీ నెంబర్ 150’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్న దాసరి.. చిరు గురించి ఏం మాట్లాడతారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అప్పుడు ఆయన ఎలా స్పందిస్తారో కానీ.. దాని కంటే ముందే ఒక ఇంటర్వ్యూలో చిరు రీఎంట్రీ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దాసరి. ఒక రకంగా ఈ సినిమాతో చిరు కొత్త హీరో లాగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడని దాసరి అభిప్రాయపడ్డారు. ఈ సినిమాతో చిరు అభిమానుల్ని బాగానే మెప్పిస్తాడని ఆయన జోస్యం చెప్పారు.

“చిరంజీవిని ఇకప్పటిలాగే జనం చూస్తారా అన్న ప్రశ్నకు ‘ఖైదీ నెంబర్ 150’ సమాధానంగా నిలుస్తుంది. నాకు ‘కత్తి’ సినిమా గురించి తెలుసు. అది మంచి సబ్జెక్ట్. ‘ఖైదీ నెంబర్ 150’లో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందనుకుంటున్నా. పాటలు.. ఫైట్లకు ఢోకా ఉండదని భావిస్తున్నా. చిరంజీవి ఇప్పుడు ఒక కొత్త హీరోలా వస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుదీర్ఘ కాలం తన కెరీర్ ఉండేలా చేసుకోవాలి” అని దాసరి అన్నారు. ఒకప్పుడు టాలీవుడ్లో నెంబర్ వన్ నుంచి నెంబర్ 10 వరకు పది స్థానాల్ని చిరంజీవే ఆక్రమించాడని తాను వ్యాఖ్యానిస్తే వేరే హీరోలు చాలామందికి చాలా కోపం వచ్చిందని దాసరి గుర్తు చేసుకున్నారు.

మరి ‘ఖైదీ నెంబర్ 150’ వేడుకలో దాసరి ఏం మాట్లాడతాడో చూడాలి.