ఆ ఫ్లాప్ నుంచి చాలా నేర్చుకున్నాడు

అక్కినేని నాగార్జున‌-కె.రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో వ‌చ్చిన తొలి ఆధ్యాత్మిక చిత్రం ‘అన్న‌మ‌య్య’ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ త‌ర్వాత వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్లో వ‌చ్చిన ‘శ్రీరామ‌దాసు’ కూడా మెప్పించింది. పెద్ద హిట్ట‌యింది.

కానీ ఈ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన మూడో ఆధ్యాత్మిక చిత్రం ‘షిరిడి సాయి మాత్రం అంచ‌నాల్ని అందుకోలేక‌పోయింది. ప్రేక్ష‌కాద‌ర‌ణ‌కు నోచుకోలేక‌పోయింది. ఆ సినిమా విష‌యంలో తామేం త‌ప్పు చేశామో త‌ర్వాత తెలుసుకున్నామ‌ని.. ఆ సినిమా ద్వారా పాఠాలు నేర్చుకుని ‘ఓం న‌మో వెంక‌టేశాయ’ తీశామ‌ని అంటున్నాడు నాగార్జున‌.

‘‘షిరిడి సాయి విష‌యంలో అంద‌రికీ తెలిసిన క‌థకే మేం క‌ట్టుబ‌డ్డాం. స‌న్నివేశాల్ని సింపుల్ గా తీసేశాం. ఈ క్ర‌మంలో ఆ సినిమా డాక్యుమెంట‌రీ లాగా త‌యారైంది. ఇలా ఉంటే ప్రేక్ష‌కులు చూడ‌ర‌ని అర్థ‌మైంది. ‘ఓం న‌మో వెంక‌టేశాయ’ విష‌యంలో జాగ్ర‌త్త ప‌డ్డాం. కొత్త విష‌యాలు చెప్పాల‌నుకున్నాం. అలాగే మాకు తెలిసిన క‌థ‌కు కొంత క‌ల్ప‌న కూడా జోడించాం. ఇది సందేశాత్మ‌క సినిమా లాగా ఉండ‌దు. తిరుమ‌ల‌కు సంబంధించి చేయాల్సిన ప‌నులు.. చేయ‌కూడ‌ని ప‌నులు అని కొన్ని ఉంటాయి. వీటికి సంబంధించిన చిన్న చిన్న క‌థ‌ల్ని వినోదాత్మ‌కంగా చెప్పాం. తిరుమ‌ల కొండ‌ల్ని అద్భుత‌మైన రీతిలో.. 16వ శ‌తాబ్దంలో ఎలా ఉండేవో అలా చూపిస్తున్నాం. ఇంకా ఈ సినిమాలో అనేక విశేషాలుంటాయి. సినిమా వినోదాత్మ‌కంగా ఉంటుంది. ప్ర‌స్తుత ప్రేక్ష‌కులు రెగుల‌ర్ మాస్ మ‌సాలా సినిమాల్ని ఆద‌రించ‌ట్లేదు. కొత్త‌ద‌నం కోరుకుంటున్నారు. ఆ కోణంలో ‘ఓం న‌మో వెంక‌టేశాయ’ ప్రేక్ష‌కుల‌కు భిన్న‌మైన అనుభూతిని పంచుతుంది’’ అని నాగ్ అన్నాడు.