చిరంజీవి ఫోన్ చేయగానే వణికిపోయాడట..

ఈ సంక్రాంతికి విడుదలైన ప్రెస్టీజియస్ సినిమాలు ఖైదీ నెంబర్ 150.. గౌతమీపుత్ర శాతకర్ణి రెంటికీ మాటలు రాసింది సాయిమాధవ్ బుర్రానే. ఆయన సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మరి సాయిమాధవ్ మాటల విషయంలో చిరంజీవి, బాలయ్యల స్పందనేంటి.. ఈ సినిమాలకు మాటలు రాసేటపుడు సాయిమాధవ్ ఫీలింగ్స్ ఏంటి.. సినిమాలు విడుదలయ్యాక సాయిమాధవన్‌ను చిరు, బాలయ్య సాయిమాధవ్‌ను ఎలా అభినందించారు.. ఈ విషయాలు సాయిమాధవ్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘శాతకర్ణికి క్లైమాక్స్‌ సీన్ రాసిన రెండో రోజే చిరంజీవి గారి నుంచి ఫోన్‌ వచ్చింది. ‘ఖైదీ నెంబర్ 150’కి రాయాలన్నారు. నేను శాతకర్ణి సినిమా పూర్తి చేసినా.. అంతటితో నా పనైపోలేదు. చిత్ర బృందం వెంటే ఉండాలి. ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వెళ్లాలి. క్రిష్ స్టయిల్ అది. అలాంటి సమయంలో చిరంజీవి గారే పిలిచి తన సినిమాకు రాయాలనడంతో నాకు వణుకొచ్చింది. వినాయక్‌ కథ చెబుతారు.. మీరు ఎన్ని సీన్లు రాయాలనుకుంటే  అన్ని రాయండి అని చిరు చెప్పారు. చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన నాకు ఆయన సినిమాల్లో ఒక డైలాగ్‌ రాసినా సంతోషమే కదా.

అందుకే ఓకే అనేశాను. ‘ఖైదీ నెంబర్ 150’ విడుదల కాగానే చిరంజీవి గారు ఫోన్‌ చేసి.. నా వర్క్‌ సినిమాకు చాలా ప్లస్సయింది అన్నారు. తర్వాత కలిసినపుడు హగ్‌ చేసుకుని ‘సినిమాలో మీ సిగ్నేచర్‌ కనిపిస్తోంది..’ అన్నపుడు చాలా సంతోషమేసింది. ఇక శాతకర్ణి విషయానికి వస్తే.. బాలయ్య గారు ఎక్కడికెళ్లినా ఈ సినిమా డైలాగులే చెబుతున్నారు. ఒక వేడుకలో వక్తలు మాట్లాడేటప్పుడు నా ప్రస్తావన రాగానే బాలయ్య లేచి నిలబడి నaమస్కారం చేశారు. నాకు భయమేసింది. వెంటనే నేనూ లేచి నమస్కారం పెట్టాను. ఫ్యూచర్ ప్రాజెక్టుల్లోనూ మనం కలిసి పని చేద్దామని బాలయ్య చెప్పారు’’ అని సాయిమాధవ్ చెప్పాడు.