వీళ్ల తర్వాత సూపర్‌స్టార్లేరీ?

తెలుగు చిత్ర సీమకి ప్రతి జనరేషన్‌ నుంచి సూపర్‌స్టార్లు వచ్చారు, వస్తున్నారు. తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లో ఎటు చూసినా కానీ ఎప్పుడూ బిగ్‌ లీగ్‌ స్టార్లంటూ వుంటూనే వుంటారు. కానీ బాలీవుడ్‌లో రెండు దశాబ్ధాల నుంచీ ఆ ముగ్గురు ఖాన్‌లే తప్ప మరో నిఖార్సయిన సూపర్‌స్టార్‌ పుట్టుకు రాలేదు. హృతిక్‌ రోషన్‌ మొదట్లో మెరిసినా తన ఇమేజ్‌ బిల్డ్‌ చేసుకోవడంలో విఫలమయ్యాడు.

అమితాబ్‌ తనయుడు అభిషేక్‌ ఆదిలోనే హోప్‌లెస్‌ అనిపించాడు. రణ్‌భీర్‌ కపూర్‌ అయినా సూపర్‌స్టార్‌ అవుతాడని అనుకుంటే ఇమేజ్‌కి కాస్తయినా ఇంపార్టెన్స్‌ ఇవ్వకుండా ప్రయోగాలు చేసుకుంటున్నాడు. రణ్‌వీర్‌ సింగ్‌, అర్జున్‌ కపూర్‌ తదితరులకి ఒక రేంజ్‌ దాటి వెళ్లే సత్తా లేదు. రాజ్‌ కపూర్‌ తర్వాత అమితాబ్‌, ఆ తర్వాత ముగ్గురు ఖాన్‌లు ఏలిన బాలీవుడ్‌కి ఇప్పుడు సాలిడ్‌గా సూపర్‌స్టార్‌ అన్నవాడే లేకుండా పోయాడు.

ఒక సినిమా బాగా ఆడితే తదుపరి చిత్రానికి ఓపెనింగ్స్‌ అయినా వస్తాయా అన్నట్టు సాగుతోంది అందరి కెరియర్‌. సల్మాన్‌, అమీర్‌ మినహా ప్రస్తుతం నమ్మకం పెట్టుకోతగ్గ పెద్ద స్టార్‌ బాలీవుడ్‌కి లేడు. వీళ్లిద్దరూ యాభైవ వడిలో పడ్డారు కనుక ఇక ఎన్నో రోజులు టాప్‌లో వుండలేరు. మరి వారి నుంచి స్టార్‌డమ్‌ తీసుకుని ఇండియాకి అతి పెద్ద సినిమా మార్కెట్‌ అయిన బాలీవుడ్‌ని నిలబెట్టే వాడు ఎప్పుడొస్తాడు? ఎటు నుంచి వస్తాడు? చూస్తోంటే అయిదారేళ్లలో బాలీవుడ్‌ తీవ్ర సంక్షోభం ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది.