స‌ముద్రాన్ని కూడా క‌బ్జా చేసేసారు

ద‌క్షిణ చైనా స‌ముద్రంలో కృత్రిమ దీవిని నిర్మించ‌డం, అక్క‌డ మిలిట‌రీ బేస్‌ల‌ను ఏర్పాటు చేయ‌డంపై  అమెరికా, ఆస్ట్రేలియా, జ‌పాన్ దేశాలు తీవ్రంగా మండిప‌డ్డాయి. ఈ చ‌ర్య‌ల‌తో మొత్తం స‌ముద్రంపై చైనా హ‌క్కులు సంపాదించే ప్ర‌మాదం ఉన్న‌ట్లు ఆ దేశాలు ఆందోళ‌న వ్య‌క్తంచేశాయి. ఏడాదికి 5 లక్ష‌ల కోట్ల డాల‌ర్ల వాణిజ్యం జ‌రిగే ఈ స‌ముద్రంపై పూర్తి హ‌క్కులు త‌న‌వే అని చైనా వాదిస్తోంది.

గ‌తంలో అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం చైనాకు వ్య‌తిరేకంగా తీర్పు చెప్పినా ఆ దేశం వెనుక‌డుగు వేయ‌లేదు. పైగా ఇది త‌మ పొరుగు దేశాల‌తో ఉన్న స‌మ‌స్య అని, ఇందులో ఇత‌ర దేశాలు త‌ల‌దూర్చితే బాగుండ‌ద‌ని కూడా చైనా హెచ్చ‌రిస్తోంది.

వియ‌త్నాం, తైవాన్‌, ఫిలిప్పీన్స్‌, మలేషియా, బ్రూనైలాంటి దేశాలు ఈ స‌ముద్రంపై త‌మ‌కు కూడా హ‌క్కు ఉంద‌ని వాదిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ దూకుడుగా ముందుకు పోతుండ‌టంతో చైనా తీరును అగ్ర‌దేశాలు ఖండిస్తున్నాయి. వివాదాస్ప‌ద ప్రాంతంలో మిలిట‌రీ స్థావ‌రాలు ఏర్పాటు చేయ‌డాన్ని అమెరికా, జ‌పాన్‌, ఆస్ట్రేలియా ప్ర‌శ్నిస్తున్నాయి. అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌కు లోబ‌డి, అర్థ‌వంత‌మైన, ప్ర‌భావ‌వంత‌మైన చ‌ర్చ‌లు జరగాల‌ని స్ప‌ష్టంచేశాయి.

అంతేకాదు గ‌తేడాది అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పును గౌర‌వించాల‌ని చైనా, ఫిలిప్పీన్స్‌ల‌కు స్ప‌ష్టంచేశాయి. గ‌తంలో చైనా తీరును తీవ్రంగా ఖండించిన ఫిలిప్పీన్స్‌.. డ్యుటెర్టి అధ్య‌క్షుడైన త‌ర్వాత ఆ దేశంతో మంచి సంబంధాల కోసం అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం తీర్పును త‌ప్పుబ‌ట్టింది. దీనికి వేల కోట్ల డాల‌ర్ల పెట్టుబ‌డులు చైనా నుంచి ఫిలిప్పీన్స్‌కు త‌ర‌లివ‌చ్చాయి. ఇలా ఏషియాన్ దేశాల‌ను చైనా విడ‌దీస్తున్న‌ద‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి.