వైసీపీ కోసం మళ్ళీ ‘పీకే’ వచ్చేస్తున్నాడట.. ఈసారి స్కెచ్ ఏంటో.!

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు సుదీర్ఘ పాదయాత్ర చేయబోతున్నారట. గతంలో ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేస్తే, ఈసారి ముఖ్యమంత్రి హోదాలో పాదయాత్ర చేస్తారట. ప్రశాంత్ కిషోర్ సూచన మేరకు పాదయాత్ర చేయాలన్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహమట. అదేంటీ, ఎన్నికలకి ఇంకా రెండున్నరేళ్ళు సమయం వుంది కదా.? అప్పుడే ఎన్నికలకు వైసీపీ సిద్ధమవడమేంటి.? ఎక్కడో తేడా కొడుతోంది కదూ.?

ఈ విషయమై ఇంకా అధికార పార్టీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే, అధికార పార్టీ నుంచే లీకులు అందుతున్నట్లుగా మీడియాలో చర్చ జరుగుతోంది. క్యాబినెట్ సమావేశంలోనే మంత్రులకు ఈ అంశాలపై ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారట. ఒకవేళ ఇది నిజం కాకపోతే, ఈపాటికే అధికార పార్టీ ‘మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు..’ అంటూ గగ్గోలు పెట్టేదే.

అన్నట్టు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, త్వరలో రాష్ట్రానికి రాబోతున్నారట.. వైసీపీకి దిశా నిర్దేశం చేస్తారట. ఇంకోసారి వైసీపీ గెలిచేందుకు వ్యూహాల్ని ఇప్పటికే ఆయన సిద్ధం చేశారట. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో వైఎస్ జగన్ మీద విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తి దాడి ఒకటి. వైఎస్ జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఇంకోటి. ఆనాటి ఆ పరిస్థితుల్ని గుర్తు చేస్తున్నారు కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో.

ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో చూశాం. మమతా బెనర్జీ గాయపడ్డారు.. కాలికి ఫ్రాక్చర్ అయ్యిందట. ఆ కాలికి కట్టు కట్టుకునే ఆమె వీల్ ఛెయిర్ ద్వారా ప్రచారం నిర్వహించారు. దీన్ని పీకే మార్కు వ్యూహంగా చెబుతారు కొందరు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అరవింద్ కేజ్రీవాల్ మీద దాడులు కూడా పీకే వ్యూహాల్లో భాగమేనన్నది సర్వత్రా వినిపించే వాదన. మరి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి వ్యూహాత్మక ఎత్తుగడలకు ఈసారి ప్రశాంత్ కిషోర్ తెరలేపబోతున్నారు.? వేచి చూడాల్సిందే.