వైఎస్‌ జగన్‌తో చిరంజీవి భేటీ.. అతి త్వరలో.!

మెగాస్టార్‌ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో భేటీ కాబోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి పలు కీలక అంశాలపై వైఎస్‌ జగన్‌తో చిరంజీవి ఈ బేటీలో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిన విషయం విదితమే. ఇప్పటికే ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వంతో చిరంజీవి నేతృత్వంలో తెలుగు సినీ పరిశ్రమ మంతనాలు షురూ చేసింది.

నిజానికి, కరోనా వైరస్‌ సంగతి పక్కన పెడితే.. తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఇరు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు చర్చలు జరిపేందుకు పలు మార్లు యత్నించారు. సినీ పరిశ్రమ తరఫున రిప్రెజెంటేషన్స్‌ కూడా ఇచ్చారు. ఆయా సందర్భాల్లో సినీ పరిశ్రమకు తమవంతు సహకారం అందిస్తామని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ భరోసా ఇచ్చారు. చిరంజీవి వ్యక్తిగతంగా చొరవ చూపి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరపడం తెల్సిన విషయమే.

తాజాగా మరోమారు చిరంజీవి లీడ్‌ తీసుకుని, తెలుగు సినీ పరిశ్రమ, ప్రభుత్వాల నుంచి ఏం ఆశిస్తుందో, తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి ఏమేం కావాలో ఆయా ప్రభుత్వాలతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే అతి త్వరలో ఇంకోసారి వైఎస్‌ జగన్‌తో చిరంజీవి భేటీ కాబోతున్నారట.

కొన్నాళ్ళ క్రితం చిరంజీవి, జగన్‌ భేటీ జరిగినప్పుడు, పరిశ్రమ అభివృద్ధి కోసం సహకరిస్తామని చిరంజీవికి జగన్‌ హామీ ఇచ్చారు. సరైన ప్రతిపాదనలతో మళ్ళీ రావాల్సిందిగా జగన్‌, చిరంజీవికి సూచించారు. దాంతో, పరిశ్రమ తరఫున ఓ రోడ్‌ మ్యాప్‌ని సినీ ప్రముఖులతో కలిసి డిజైన్‌ చేసిన చిరంజీవి, దాన్ని వైఎస్‌ జగన్‌ ముందుంచనున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమకు రాయితీలు, షూటింగులకు అనుమతుల సమయంలో ఇబ్బందులు లేకుండా చూడటం, టిక్కెట్ల ధరల పెంపుదల అంశం సహా చాలా విషయాలు ఈ రోడ్‌ మ్యాప్‌లో వున్నట్లు తెలుస్తోంది.

పైరసీ అనేది వీటిల్లో అత్యంత కీలక అంశంగా వుందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి అర్థమవుతోంది. ఇదిలా వుంటే, కొద్ది రోజుల క్రితమే. ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి సహా పలు అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. షూటింగులకు అనుమతులు వంటి అంశాలపై సినీ పరిశ్రమకు పలు వెసులుబాట్లను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కల్పించిన విషయం విదితమే.