జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త ఇబ్బందిగా మారిన నేపథ్యంలో పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పగించనున్నారా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది.

ఏపీలో వైఎస్సార్ సీపీ తిరుగులేని విజయం నమోదు చేసుకుని అధికారం చేపట్టి ఏడాది పూర్తయింది. ఈ సమయంలో మేనిఫెస్టో అమల్లో దూకుడుగా వెళ్తున్న సీఎం జగన్.. పార్టీ విషయంలో మాత్రం సరైన విధంగా వ్యవహరించలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పార్టీలో నెంబర్ టూ పొజిషన్ లో కొనసాగుతున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అటు ఢిల్లీ వ్యవహారాలు చక్కబెడుతూనే ఇటు పార్టీ వ్యవహారాలు కూడా కొంతవరకు చూస్తున్నారు.

అయితే, పదేళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కింది స్థాయి కార్యకర్తలు తమను ఎవరూ పట్టించుకోవడంలేదనే అసంతృప్తితో ఉన్నారు. పాలనా వ్యవహారాల్లో బిజీగా మారిపోయిన సీఎం జగన్.. పార్టీ నేతలను సైతం కలిసే పరిస్థితి లేదు. పార్టీ ఎమ్మెల్యేలు కూడా జగన్ అపాయింట్ మెంట్ కోసం చాలా రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి. దీంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక పార్టీకి చెందిన పలువురు నేతలు సతమతవుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పగించాలని జగన్ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

ప్రస్తుతం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ఇందుకు ఎంచుకున్నట్టు చెబుతున్నారు. వైఎస్ కుటుంబానికి ఎప్పటినుంచో సన్నిహితుడైన సజ్జలకు అందరినీ కలుపుకొని వెళ్లే వ్యక్తిగా పేరుంది. తొలుత సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉన్న ఆయన్ను జగన్ పార్టీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్న సజ్జల.. ఎన్నికల ముందు అందరినీ సమన్వయపరచడంలో విశేష కృషి చేశారు.

ప్రస్తుతం పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయనే అందుబాటులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డిని ఢిల్లీ వ్యవహారాలకు పరిమితం చేసి, సజ్జలకు పార్టీ బాధ్యతలు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ వర్గాల ద్వారా తెలిసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇకపై నిత్యం సజ్జల అందుబాటులో ఉంటారని చెబుతున్నారు. ప్రస్తుతం ఏడాది పాలనపై పార్టీ మేధోమథన సదస్సు జరుగుతోంది. ఆరు రోజులపాటు ఇది జరగనుంది. ఈ సందర్భంగానే సజ్జలకు పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం.