కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉత్తరాంధ్ర వైసీపీ నేతల్లో అసంతృప్తి

వైసీపీ సర్కార్ కు ఓ విషయంలో విపక్షం కన్నా స్వపక్షం నుంచి విమర్శలు ఎక్కువయ్యాయట. కొత్త జిల్లాల ఏర్పాటుతో మరిన్ని పదవులు, నామినేటెడ్ పోస్టులు క్రియేట్ చేయొచ్చన్న సీఎం జగన్ ఆలోచన ఇపుడు ఆయనకే బూమరాంగ్ అవుతోందట. కొత్త జిల్లాల ఏర్పాటుతో తమ ఉనికిని కోల్పోతామంటూ రాష్ట్రంలోని పలువురు వైసీపీ సీనియర్, జూనియర్ నాయకులు సీఎంకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మొర పెట్టుకుంటున్నారట. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు…ఈ కొత్త జిల్లాల ప్రతిపాదనపై కక్కలేక మింగలేక ఉన్నారట. జిల్లాలను విభజిస్తే భౌగోళికంగా తమ ప్రాంతం రూపు రేఖలు మారిపోతాయని, తమ నియోజకవర్గాల్లో పట్టు కోల్పోతామని సీఎం జగన్ కు విన్నవించుకుంటున్నారట.

ప‌క్క జిల్లాల్లో తమ ప్రాంతాలను క‌లప‌వ‌ద్దని కొందరు ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు అంటుంటే….పెద్ద జిల్లాని చిన్న జిల్లాలుగా ముక్కలు చేయొద్దని మరికొందరు అంటున్నారట. ఉత్తరాంధ్రకు చెందిన నేతలకు కొత్త జిల్లాల విభజన ఏ మాత్రం ఇష్టం లేదట. కొత్త జిల్లాల వ్యవహారంపై ఉత్తరాంధ్రవాసులకు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులకు ఉన్న అసంతృప్తికి అనేక కారణాలున్నాయట. పార్లమెంటు ప‌రిధి ప్రకారం అరకు నియోజ‌క‌వ‌ర్గం విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం, తూర్పుగోదావ‌రి జిల్లాల్లో విస్తరించింది. అర‌కును జిల్లాగా ప్రక‌టిస్తే.. ఆ జిల్లాల్లోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు అరకులో క‌లుస్తాయి. అదే జరిగితే పార్టీకి డ్యామేజీ అని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు అంటున్నారట. అరకు జిల్లా అయితే విజయనగరం జిల్లాలో ఉన్న పార్వతీపురం, కురుపాం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు, శ్రీకాకుళం జిల్లా పాలకొండ సెగ్మెంట్, తూర్పు గోదావ‌రి జిల్లాలోని రంప‌చోడ‌వ‌రం అర‌కు జిల్లాలోకే వెళతాయి.

అందుకే, అరకును రెండు జిల్లాలు చేయాలని కొందరు నేతలు అంటుంటే పార్వతీపురం కేంద్రంగా కొత్త జిల్లా ప్రకటించాలని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి డిమాండ్ చేస్తున్నారట. ఇక, సాలూరు కేంద్రంగా మ‌రో గిరిజ‌న జిల్లా ఏర్పాటు చేయాల‌ని స్థానిక ఎమ్మెల్యే రాజ‌న్నదొర‌ కోరుకుంటున్నారట. లోక్ సభ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాల ఏర్పాటుతో సిక్కోలుకు అన్యాయం జరుగుతుందని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇలా సొంత పార్టీలోనే జిల్లాల విషయంలో తీవ్ర గందరగోళం ఉండడంతో వైసీపీ అధిష్టానం ఏం చేయాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతోందట. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర నేతలంతా అలా చేయొద్దంటూ జగన్ ను రిక్వెస్ట్ చేస్తున్నారట. ఏది ఏమైనా…కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో విపక్షాల కన్నా స్వపక్షంతోనే జగన్ కు చిక్కులు తప్పేలా లేవు. మరి, ఉత్తరాంధ్ర నేతల రిక్వెస్ట్ ను జగన్ పరిగణిస్తారా….లేదంటే వారిని బుజ్జగిస్తారా…అన్నది ఆసక్తికరంగా మారింది.