ఢిల్లీకి సీఎం జగన్‌.. ఈ టూర్‌ చాలా చాలా ప్రత్యేకం.!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రుల్ని వైఎస్‌ జగన్‌ ఈ టూర్‌లో కలిసే అవకాశం వుందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్‌ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది.

వాస్తవానికి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఢిల్లీకి వెళ్ళడం అనేది సాధారణమైన విషయమే. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించడం.. ఇవన్నీ మామూలే. కానీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. రాజకీయంగా చాలా అలజడిని చూస్తున్నాం గత కొద్ది రోజులుగా.

ప్రధానంగా బీజేపీ – వైసీపీ మధ్య చాలా విషయాల్లో ‘ఘర్షణ’ వాతావరణం చోటు చేసుకుంటోంది. హిందూ మతంపై దాడి జరుగుతోందంటూ జగన్‌ సర్కార్‌పై మండిపడుతోంది బీజేపీ. ఈ మేరకు ఇప్పటికే బీజేపీ నేతలు కొందరు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకి ఫిర్యాదు కూడా చేశారు.

మరోపక్క, మూడు రాజధానుల ఎపిసోడ్‌పై ఇప్పటికే కేంద్రం పలు అఫిడవిట్లు దాఖలు చేయగా, అవన్నీ వైసీపీ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా వున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే, శాసన మండలి రద్దు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు సహా అనేక అంశాలపై కేంద్రానికి వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా ఓ ‘విజ్ఞప్తి’ చేసేందుకే ఢిల్లీకి వెళుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

మరోపక్క, వ్యవసాయ రంగానికి సంబంధించి కొత్త బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందడం, ఈ క్రమంలో వైసీపీ, ఎన్డీయే ప్రభుత్వానికి రాజ్యసభలో సహకరించిన విషయం విదితమే. ఇలా కొన్ని అనుకూలతలు, ఇంకొన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ వైఎస్‌ జగన్‌ ఢిల్లీ టూర్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అన్నట్టు, టీటీడీ – డిక్లరేషన్‌ వ్యవహారంపైనా దుమారం రేగుతున్న వేళ, వైఎస్‌ జగన్‌ ఢిల్లీ టూర్‌ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.