పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేస్తే.. ‘మత రాజకీయం’ కోసం కేసులెత్తేస్తారా.?

ఈసారి రేంజ్‌ పెరిగింది.. సీబీఐ మాత్రమే కాదు, అవసరమైతే ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ)తో విచారణ చేయించడానికీ వెనుకాడబోం.. అని ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ‘పాలన’ ఎంత అద్భుతంగా వుందో చెప్పడానికి, న్యాయస్థానాల్లో పడుతున్న మొట్టికాయలే నిదర్శనమని అనుకోవాలేమో. పోలీస్‌ స్టేషన్‌పై కొందరు దుండగులు దాడికి దిగితే, ‘ముస్లిం యువత’ అన్న కోణంలో ‘జాలి’ చూపించి, కేసుల్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ఇలాంటి కేసుల్లో ‘మతం’ కోణంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తే ఎలా.? పోలీసు శాఖ పట్ల ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఎలా వుంటుంది.? అసాంఘీక శక్తులకి పోలీసులంటే భయమెలా వుంటుంది.? అన్న విమర్శలు అప్పట్లోనే వివిధ రాజకీయ పార్టీల నుంచి, ప్రజా సంఘాల నుంచీ, ప్రజాస్వామ్యవాదుల నుంచీ, రాజకీయ విశ్లేషకుల నుంచీ వెల్లువెత్తాయి.

పైగా, జీవోలో ‘ముస్లిం యువత’ అంటూ పేర్కొనడం మరింత వివాదాస్పదమయ్యింది. ప్రభుత్వ అత్యుత్సాహంపై న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు కాగా, న్యాయస్థానం.. ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పెద్ద పెద్ద ఘటనలు జరుగుతోంటే, ‘ఆకతాయిల’ పని అని కొట్టి పారేయడం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికే చెల్లుతోంది. వివాదం ముదిరి పాకాన పడ్డాక కొన్ని ఘటనల్లో ‘సీబీఐ విచారణ’ అంటూ చేతులు దులుపుకోవడాన్నీ చూస్తున్నాం. రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు అనేవి వున్నాయా.? అన్న ఆందోళన సర్వత్రా నెలకొంటోంది.

ఆయా ఘటనల్లో, ప్రభుత్వ వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తున్నా, ప్రభుత్వం తన తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకోలేకపోతుండడం శోచనీయం. ఓటు బ్యాంకు రాజకీయాలే పరమార్ధంగా అధికార పార్టీ కార్యాచరణ కొనసాగుతోంది. ఇలాంటి చర్యలపై కొందరు న్యాయస్థానాల్ని ఆశ్రయించడం, న్యాయస్థానాలు ప్రభుత్వానికి మొట్టికాయలేయడం పరిపాటిగా మారిపోయింది. అది జీర్ణించుకోలేక, న్యాయవ్యవస్థపై దాడికీ అధికార పార్టీ వెనుకంజ వేయకపోవడం ఆశ్చర్యకరం.

గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో హిందూ సమాజంపై దాడి జరుగుతోంటే, అన్ని మతాలూ ఒక్కతాటిపైకి వచ్చి ఈ దారుణాన్ని ఖండించాలని జనసేన పార్టీ పిలుపునిస్తే.. దాన్ని ‘మత రాజకీయం’ అంటోన్న వైసీపీ ప్రభుత్వం, కేసుల ఎత్తివేత క్రమంలో అత్యుత్సాహం చూపిస్తూ ‘మతం’ పేరు ప్రస్తావించడాన్ని అసలు సిసలు ‘మత రాజకీయం’ అని కాక ఇంకేమనాలి.? మతాల పేరు చెప్పి ఓట్లు దండుకోవాలన్న వైసీపీ చెత్త రాజకీయం కంటే ‘మత రాజకీయం’ ఇంకేముంటుంది.?