వైఎస్‌ జగన్‌ ఎఫెక్ట్‌తోనే జీవీఎల్‌ వికెట్‌ పడిందా.?

‘‘జీవీఎల్‌ నరసింహారావు, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల భర్త ‘బ్రదర్‌’ అనిల్‌కి బంధువట..’’ అంటూ ఆ మధ్య సోషల్‌ మీడియాలో పెద్దయెత్తున ప్రచారం జరిగింది. ఆ కారణంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని జీవీఎల్‌ వెనకేసుకొస్తున్నారంటూ రకరకాల కామెంట్స్‌ సోషల్‌ మీడియా వేదికలపై దర్శనమిచ్చిన సంగతి తెల్సిందే. ఆ సంగతి పక్కన పెడితే, తాజాగా జీవీఎల్‌, బీజేపీ అధికార ప్రతినిది¸ అనే హోదాని కోల్పోయారు.

ఎందుకిలా.? ఆయన్ని ఎందుకు అధిష్టానం పక్కన పెట్టింది.? అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జీవీఎల్‌, టీడీపీ వ్యతిరేకి. ఇది అందరికీ తెల్సిన విషయమే. అదే సమయంలో ఆయన వైసీపీ అడుగులకు మడుగులొత్తుతున్నారన్న విమర్శలూ లేకపోలేదు. రాజధాని విషయంలోనూ. ఇతర ముఖ్యమైన అంశాల్లోనూ జీవీఎల్‌, వైసీపీకి రాజకీయంగా మేలు చేసేలా చాలా వ్యాఖ్యలు చేశారు. దాంతో బీజేపీలో ఓ వర్గం, జీవీఎల్‌పై గుస్సా అవడం, అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగిపోయాయట.

ఈ నేపథ్యంలో జీవీఎల్‌ కొంత అలర్ట్‌ అయ్యారనీ, రాష్ట్రంలో దేవాలయాలపై దాడుల నేపథ్యంలో జీవీఎల్‌, అధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేయడానికి ఆ అంశాన్ని బాగానే వాడుకున్నారనీ, అయినా అధిష్టానం ఆయన్ని పక్కన పెట్టాలన్న నిర్ణయాన్ని మార్చుకోలేదనీ ఢిల్లీ నుంచి లీకులు అందుతున్నాయి. అయితే, పార్టీ అన్నాక సంస్థాగతంగా కొన్ని మార్పులు సర్వసాధారణం. అనేక ఈక్వేషన్స్‌ చూసుకుని మరీ ఈ మార్పులు జరుగుతుంటాయి.

అయితే, నేషనల్‌ మీడియాలోనూ పార్టీ గళం గట్టిగా వినిపించగల జీవీఎల్‌, అధికార ప్రతినిది¸ పదవి కోల్పోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. పదవి పోవడం సంగతి పక్కన పెడితే, ‘వైఎస్‌ జగన్‌ ఎఫెక్ట్‌తోనే పదవి పోయింది’ అన్న బాధ ఇప్పుడు జీవీఎల్‌ని మరింత వెంటాడేలా వుంది. ఇది వైసీపీకి కూడా పెద్ద షాక్‌.. అనేవారూ లేకపోలేదు. ఎందుకంటే, బీజేపీలో పరోక్షంగా వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకునే నేతల్లో జీవీఎల్‌ని ముఖ్యులుగా చెబుతుంటారు మరి.