ముఖ్యమంత్రికి ఆ మాత్రం విజ్ఞత, అవగాహన లేకపోతే ఎలా.?

‘ప్రభుత్వాలు చేసే చట్టాలు రాజ్యాంగ పరిధిలో వున్నాయో లేదో సమీక్షించే అవకాశం న్యాయస్థానాలకు మాత్రమే వుంటుంది. న్యాయ వ్యవస్థ తన పని తాను చేయనీయకుండా ఓ ముఖ్యమంత్రి వ్యవహరించడమేంటి.? న్యాయస్థానాల్లో తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే, అప్పీల్‌ చేసుకునే అవకాశం సామాన్యుడితోపాటు, ప్రభుత్వానికీ వుంటుంది. ప్రభుత్వాధినేతగా కోర్టుల నిర్ణయాల్ని గౌరవించాలి.. పై కోర్టులో సవాల్‌ చేసుకోవాలి.. అంతే తప్ప, న్యాయమూర్తులకు దురుద్దేశ్యాలు ఆపాదించడమేంటి.? ముఖ్యమంత్రికి ఆ మాత్రం విజ్ఞత, అవగాహన లేకపోతే ఎలా.?’ అంటూ ప్రశ్నిస్తున్నారు హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్‌ఎస్‌ సోధి.

చాలామంది విశ్రాంత న్యాయమూర్తులు, ప్రముఖ న్యాయ కోవిదులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ సహా, పలువురు హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ బాబ్డేకి ఫిర్యాదు చేయడం దేశంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘మా రేంజ్‌ పెరిగింది.. న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయబోతున్నాం..’ అంటూ వైసీపీ మద్దతుదారులు సోషల్‌ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శిస్తోన్న వేళ, న్యాయ కోవిదులు మాత్రం, వైసీపీ ఆలోచనల్ని తప్పుపడుతున్నారు.. ముఖ్యమంత్రి తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

బార్‌ కౌన్సిళ్ళు సైతం, ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి తీరుని తప్పు పడుతున్న విషయం విదితమే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. అయితే, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వ్యవహార శౖలి అస్సలేమాత్రం బాగాలేదన్న వాదనే ప్రముఖంగా వినిపిస్తోంది. ఓ వ్యక్తిగా, ప్రభుత్వాధినేతగా తనకున్న అనుమానాల మేరకు, సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కి లేఖ రాసినా, దాన్ని బహిరంగ పర్చడం అనేది నేరంగా కొందరు న్యాయ కోవిదులు అభిప్రాయపడుతున్నారు.

‘ఓ ముఖ్యమంత్రి, న్యాయమూర్తి మీద ఆరోపణలు చేసినంతమాత్రాన, ఆ న్యాయమూర్తికి మకిలి అంటుకోదు. ఆరోపణలు చేసిన వ్యక్తి మీదనే చాలా కేసులు నమోదయి వున్నాయి. విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి, న్యాయ వ్యవస్థ మీద ఆరోపణలు చేయడం హాస్యాస్పదం..’ అని ఓ న్యాయ కోవిదుడు అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా, ఈ వ్యవహారంలో వైసీపీ అత్యుత్సాహం సుస్పష్టం. ఆ అత్యుత్సాహానికి తగిన మూల్యం వైసీపీ చెల్లించుకోక తప్పదా.? వేచి చూడాల్సిందే.