వైసీపీ ప్రభుత్వం సొంత పత్రికకు దోచిపెడుతోందా.?

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, సొంత పత్రికకు దోచిపెడుతోందంటూ సోషల్‌ మీడియాలో పెద్దయెత్తున ‘రచ్చ’ జరుగుతోంది. గుంటూరు నగరంలో మొత్తం 207 వార్డు కార్యాలయాలకు రోజుకి రెండు ‘సాక్షి’ పత్రికలు వచ్చేలా సాక్షి యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకోవడం.. ఈ క్రమంలో ‘ఏడాది సబ్‌స్క్రిప్షన్‌’ కింద నాలుగు లక్షల పధ్నాలుగు వేల రూపాయలు చెల్లించడం పెను దుమారానికి కారణమవుతోంది. కేవలం సాక్షి దిన పత్రికకు మాత్రమే ఈ చెల్లింపులు జరిగాయా.? మిగతా పత్రికలకు కూడా అవకాశం కల్పించారా.? అన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది. సాక్షి అంటే అది వైసీపీ సొంత పత్రిక. ఇది అందరికీ తెలిసిన విషయమే.

ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వ హయాంలో తమ సొంత పత్రికకు ‘లాభం’ చేకూర్చే పనుల్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో.. అంటే, చంద్రబాబు హయాంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలు పండగ చేసుకున్నాయి. పత్రికలు, న్యూస్‌ పేపర్లలో అడ్వర్టయిజ్‌మెంట్లు.. ఆ రెండు మీడియా సంస్థలకు అప్పట్లో ఎక్కువగా వచ్చేవి. ఇప్పుడు ఆ అదృష్టం సాక్షికి దక్కినట్లే కనిపిస్తోంది. సాక్షిలో పనిచేసే చాలామంది ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పలు విభాగాల్లో నామినేట్‌ చేయడం తెలిసిన సంగతే. ఎవరు అధికారంలో వుంటే, వారికి అనుకూల మీడియా సంస్థలకు లాభం చేకూర్చడం అనేది పరిపాటిగా మారిపోయింది. ప్రజలేమనుకుంటున్నారు.? అన్న ఇంగితం కాస్తంతైనా లేకపోవడం గమనార్హం.

ప్రజా ధనాన్ని తమ సొంత సంస్థల వైపు పాలకులు మళ్ళిస్తుండడంపై.. ‘చర్చ’ జరగాల్సిందే. న్యాయ వ్యవస్థపైనో, మరో వ్యవస్థపైనో చర్చ జరగడం కాదు. ప్రజలకు జవాబుదారీగా వుండాల్సిన పాలకులు, ప్రజా ధనాన్ని కొల్లగొట్టి, తమ వ్యాపారాల్ని వృద్ధి చేసుకోవడంపై నిఖార్సయిన చర్చ జరిగితే, ఎవరి బండారం ఏంటో తేలిపోతుందన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. మరి, సాక్షి పత్రికకు ప్రభుత్వ పెద్దలు దోచిపెడుతున్నారన్న విమర్శలకు అధికార పార్టీ నేతలు ఏం సమాధానమిస్తారో వేచి చూడాల్సిందే.