కూల్చివేతలు, విధ్వంసాలే సీఎం జగన్ కు తెలుసు: అచ్చెన్నాయుడు

విశాఖలోని గీతం యూనివర్శిటీ ప్రహరీగోడలు కూల్చివేతలపై టీడీపీ స్పందించింది. ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. సీఎంగా జగన్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచీ కూల్చివేతలపైనే దృష్టి పెట్టారని ఆరోపించింది. విధ్వంసాలు, అవినీతి, అక్రమాలే, కూల్చివేతలే అజెండాగా సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని మండిపడింది. ఈమేరకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ చర్యలపై నిప్పులు చెరిగారు.

‘గీతం యూనివర్సిటీ ప్రహరీగోడల కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులను పెట్టి అర్థరాత్రి గోడలు కూల్చాల్సిన అవరసం ఏంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నీరు, భూమి దోచుకోవడానికి గీతం సంస్థ జగన్ పెట్టిన భారతీ సిమెంట్స్ కాదు. ఉత్తరాంధ్రలో టీడీపీ సానుభూతిపరులపై ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఉత్తరాంధ్రలో అలజడి సృష్టిస్తున్నారు. విద్యార్థులు, ప్రజలు మేల్కొనాలి. ఉత్తరాంధ్రను కాపాడుకోవాలి. వైసీపీ నేతలు కనపడిన భూమినల్లా కబ్జా చేస్తూ రాష్రాన్ని దోచుకుంటున్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు’ అని అచ్చెన్నాయుడు అన్నారు.

వెనకబడ్డ ఉత్తరాంధ్రలో విద్యార్ధులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా గాంధీ స్ఫూర్తితో గీతం యూనివర్సిటీ ఏర్పడింది. ఎంతోమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దింది. కోవిడ్ సమయంలోనూ ఉద్యోగ భధ్రత కల్పించింది. హుద్ హుద్ సమయంలో ప్రజలకు ఆశ్రయం ఇచ్చింది. కరోనాతో భయపడుతున్న విశాఖ ప్రజలకు వాలంటీర్ గా సేవలు అందించింది’ అని అన్నారు. ప్రభుత్వ భూములు అక్రమించి నిర్మాణాలు చేపట్టారని.. యూనివర్సిటీ ప్రహరీ గోడ, సెక్యూరిటీ కార్యాలయం ప్రధాన ద్వారాన్ని అధికారులు కూల్చేసిన విషయం తెలిసిందే.