ఏడుకొండలు కబ్జా: జగన్‌పై బీజేపీ పవర్‌ పంచ్‌.!

తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి భారతీయ జనతా పార్టీ వ్యూహమేంటి.? రాష్ట్రంలో ఏడాదిన్నరగా సాగుతున్న ప్రజా వ్యతిరేక పాలన, ప్రభుత్వ వైఫల్యాలు సహా అనేక అంశాల్ని హైలైట్‌ చేస్తూ బీజేపీ ఇప్పటికే చాలా చాలా పోరాటాలు చేసేసింది. అయితే, ఆ పోరాటాల్లో చిత్తశుద్ధి ఎంత.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. బీజేపీలో ఓ వర్గం వైఎస్సార్సీపీకి తెరవెనుక సహాయ సహకారాలు అందిస్తోన్న మాట వాస్తవం. ఇంకో వర్గం తెలుగుదేశం పార్టీతో అంటకాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏ విషయమ్మీద బీజేపీ గట్టిగా మాట్లాడినా, అందులో చిత్తశుద్ధి కన్పించడంలేదు.

నిజానికి, తిరుపతి ఉప ఎన్నిక భారతీయ జనతా పార్టీకి అత్యంత ప్రత్యేకమైనది.. ప్రతిష్టాత్మకమైనది కూడా. ఈ నేపథ్యంలోనే సాక్షాత్తూ బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల తిరుపతి పర్యటించి, అక్కడి పరిస్థితుల్ని వాకబు చేశారు. అన్ని పార్టీలకంటే బీజేపీ ముందుగా తిరుపతి ఉప ఎన్నిక విషయమై వ్యూహరచన షురూ చేసింది. గడచిన ఏడాదిన్నర కాలంలో తెరపైకి వచ్చిన టీటీడీ వివాదాల్ని ప్రధానాంశంగా చేసుకుంటే ఎలా వుంటుందన్న చర్చ ప్రస్తుతం బీజేపీలో జరుగుతోందట. అంతకన్నా ముందు బీజేపీ తరఫున అభ్యర్థి ఎవరన్నది ఆ పార్టీ తేల్చుకోవాల్సి వుంది. దాంతోపాటుగా, జనసేనతో పొత్తు చర్చలు మొదలుపెట్టాల్సి వుంటుంది. గ్రౌండ్‌ లెవల్‌లో జనసేనకి బలమెంత.? బీజేపీకి బలమెంత.? అన్నదానిపై ఓ నిర్ణయానికి వచ్చాకనే ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాల్సి వుంటుంది. కానీ, బీజేపీ.. తనంతట తానుగా ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నిక విషయమై ఓ ప్రకటన చేసేసింది.

ఆ సంగతి పక్కన పెడితే, వైఎస్‌ జగన్‌ హయాంలో ఏడు కొండలు కబ్జా అవుతాయంటూ బీజేపీ సీనియర్‌ నేత సత్యకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలిప్పుడు రాజకీయంగా పెను దుమారానికి కారణమవుతున్నాయి. అయితే, బీజేపీ ఎంత గట్టిగా విమర్శించినా.. ఆ విమర్శల్ని వైసీపీ అంత సీరియస్‌గా తీసుకునే పరిస్థితి లేదన్నది నిర్వివాదాంశం. ‘ఢిల్లీ స్థాయిలో మాకు బీజేపీతో సన్నిహిత సంబంధాలున్నాయ్‌..’ అని వైసీపీ నేతలు కొందరు బాహాటంగానే చెబుతున్నారు మరి.