తిరిగొస్తున్న ‘ఏపీ బిల్లులు’ ఎక్కడ తేడా కొడ్తోంది చెప్మా.!

శాసన మండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తీర్మానం చేసి, దాన్ని కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, ఇప్పటిదాకా కేంద్రం ఆ వ్యవహారంపై సానుకూలంగా స్పందించలేదు. ‘కేంద్రానికి ముందే సమాచారం ఇచ్చి ఆయా కార్యక్రమాలు చేపడుతున్నాం..’ అని వైసీపీ నేతలు కొందరు చెబుతున్నదే నిజమైతే, శాసన మండలి విషయంలో రాష్ట్రానికి కేంద్రం ఎందుకు తీపి కబురు అందించడంలేదట.?

సరే, శాసన మండలి వ్యవహారాన్ని పక్కన పెడదాం. అత్యంత ప్రతిష్టాత్మకంగా దిశ చట్టాన్ని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సంకల్పించింది. కానీ, కేంద్రం రాష్ట్రానికి ఈ విషయంలోనూ తీపి కబురు అందించలేకపోయింది. ‘దేశానికే దిశానిర్దేశం చేస్తున్నాం..’ అని చెప్పేసుకుంది అప్పట్లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, దిశ చట్టం విషయమై. దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటయ్యాయి.. ఆ పేరుతో నానా రకాల పబ్లిసిటీ స్టంట్లూ నడిచాయి, నడుస్తూనే వున్నాయి.

తాజాగా, ‘ల్యాండ్‌ టైటిల్‌’ చట్టం విషయంలోనూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి షాకిచ్చింది. ఈ బిల్లుకి సంబంధించి కేంద్రం లేవనెత్తిన పలు ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సరైన సమాధానాలివ్వలేకపోవడంతో, కేంద్రం.. ల్యాండ్‌ టైటిల్‌ బిల్లుని వెనక్కి పంపింది. ఆయా బిల్లులకు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం తన పరిధుల్ని దాటి అత్యుత్సాహం ప్రదర్శిస్తోందనీ, ఆ కారణంగానే కేంద్రం ఆయా బిల్లుల విషయమై రాష్ట్రానికి షాకుల మీద షాకులు ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

న్యాయస్థానాల మీద అవాకులు చెవాకులు పేలినట్లు, కేంద్రంపై అధికార పార్టీ నేతలు ఇలాంటి సందర్భాల్లో వ్యాఖ్యానించగలరా.? ఛాన్సే లేదు. కేంద్రాన్ని తూలనాడితే ఏం జరుగుతుందో వైసీపీ నేతలకీ తెలుసు, ఆ పార్టీ అధిష్టానానికి ఇంకా బాగా తెలుసు. అందుకే, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌. ఏదిఏమైనా, తిరిగొస్తున్న ఆయా బిల్లుల విషయమై అధికార పార్టీ చేసిన పబ్లిసిటీ స్టంట్ల కారణంగా ప్రజలకు సమాధానం చెప్పుకోలేని దుస్థితిలోకి వెళ్ళిపోతోందన్నది నిర్వివాదాంశం.