కేసీఆర్‌ని పడగొడ్తాం.. షర్మిలక్కను సీఎంని చేస్తాం.!

‘తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రిగా షర్మిలక్కను గెలిపిస్తాం.. కేసీఆర్ రాజకీయ జీవితానికి సమాధి కడతాం.. జోహార్ రాజన్న.. జై తెలంగాణ..’ అంటూ తెలంగాణ రాజకీయాల్లో షర్మిల మద్దతుదారులు నినదిస్తున్నారు. వివిద జిల్లాల్లోని వైఎస్సార్ అభిమానులతో షర్మిల వ్యూహాత్మక భేటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా భేటీలో, షర్మిల.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానుల ముందు కొన్ని ప్రశ్నలుంచారు. ఈ ప్రశ్నావళిలో పలు ఆసక్తికరమైన ప్రశ్నలున్నాయట. తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌ని ఢీకొనడమెలా.? అన్నది అందులో కీలక ప్రశ్నగా కనిపిస్తోంది. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన దరిమిళా, ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక, ప్రాణాలు కోల్పోయిన వారికి భరోసాగా తెలంగాణలో ఇంకోసారి పాదయాత్ర చేయాలన్నది షర్మిల ఆలోచనగా కనిపిస్తోంది.

గ్రామ స్థాయిలో తెలంగాణ సెంటిమెంట్ ప్రభావం ఎంతుంది.? దాన్ని వైఎస్ సెంటిమెంట్ ఎంతవరకు ఓడించగలుగుతంది.? వంటి అంశాల చుట్టూ షర్మిల, తన మద్దతుదారులతో మంతనాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ అభిమానులైన ఆయా పార్టీలకు చెందిన నేతలు ఒక్కతాటిపైకి వచ్చేందుకు వీలుగా తెరవెనుక మంత్రాంగం నడుస్తోంది. గతంలో వైసీపీ తరఫున పనిచేసిన నాయకుల్లో చాలామంది ఇప్పుడు షర్మిల వెంట కనిపిస్తున్నారు.

‘షర్మిల పార్టీతో మాకేం సంబంధం లేదు’ అని వైసీపీ చెబుతున్నా, వైసీపీ నాయకులే పూర్తిస్థాయిలో షర్మిలకు మద్దతిస్తుండడం గమనార్హం. మొదట్లో షర్మిలను లైట్ తీసుకున్న అధికార టీఆర్ఎస్, ఇప్పుడు గ్రామ స్థాయిలో షర్మిల ప్రభావం ఎంత.? అన్నదానిపై గుస్సా అవుతోందట. ‘కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పరంగా వెనక్కి వెళ్ళిపోయింది.. రాజన్న రాజ్యం తీసుకొద్దాం..’ అంటూ షర్మిల బాహాటంగానే నినదిస్తున్న తీరుతో గులాబీ శ్రేణులూ ఆందోళన చెందుతున్నాయి.

‘షర్మిలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అంటూనే, షర్మిల కారణంగా కోల్పోయే ‘క్రిస్టియన్, మైనార్టీ’ ఓటు బ్యాంకుపై గులాబీ పార్టీ గుస్సా అవడం వింతేమీ కాదు.