దళపతి కోసం ఏజెంట్ టీనా రిపోర్టింగ్!

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ దాదాపు నాలుగేళ్ల విరామం అనంతరం నటించిన మూవీ ‘విక్రమ్’. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందిన యాక్షన్ స్పై థ్రిల్లర్ ఇది. విజయ్ సేతుపతి ఫహద్ ఫాజిల్ నరేన్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ గత ఏడాది విడుదలై కల్ట్ క్లాసిక్ మూవీగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. కమల్ నటించిన సినిమాల్లో అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా సరికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. ఈ మూవీలో నటించిన ఒక్కో నటుడు ఒక్కో పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు.

ప్రీ క్లైమాక్స్ లో కనిపించిన హీరో సూర్య రోలెక్స్ సార్ గా డ్రగ్ మాఫియా కింగ్ ఫిన్ గా డిఫరెంట్ మేకోవర్ తో కనిపించి అశ్చర్యపరిచాడు. తనదైన మార్కు నటనతో గ్యాంగ్ స్టర్లకే గ్యాంగ్ స్టర్ గా కనిపించి ‘విక్రమ్’ క్లైమాక్స్ కి ప్రధాన హైలైట్ గా నిలిచిన విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి డ్రగ్ పెడ్లర్ సంతానంగా ఫహద్ ఫాజిల్ ఏజెంట్ అమర్ గా నరేన్ ఇన్స్పెక్టర్ బిజోయ్ గా కాళిదాస జయరామ్ కమీషనర్ ప్రభంజన్ గా చెంబన్ వినోద్ జోస్ గా కనిపించి అదరగొట్టారు.

వీరందరికి మించి కీలక యాక్షన్ ఎపిసోడ్ లో వాసంతి ఏజెంట్ టీనాగా కనిపించి ఆశ్చర్యపరిచింది. ఒంటి చేత్తో విలన్ లని మట్టికరిపిస్తూ తెగువగల ఏజెంట్ గా వాసంతి ఏజెంట్ టీనాగా కనిపించి అదరగొట్టేసింది. అదే వాసంతి ప్రస్తుతం దళపతి విజయ్ నటిస్తున్న 67వ ప్రాజెక్ట్ లోనూ కనిపించబోతోంది. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని కశ్మీర్ లో స్టార్ట్ చేశారు.

ఇందు కోసం చిత్ర బృందం అంతా ప్రత్యేక విమానంలో కశ్మీర్ బయలు దేరిన ఓ వీడియోని చిత్ర బృందం శుక్రవారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో దళపతి 67 చిత్ర యూనిట్ తో కలిసి వాసంతి కూడా కనిపించి సందడి చేసింది. తనదైన మార్కు పంచ్ లతో వీడియోలో హల్ చల్ చేసింది. ‘విక్రమ్’లో పవర్ ఫుల్ ఏజెంట్ గా కనిపించిన వాసంతి ఈ మూవీలోనూ అదే స్థాయి పాత్రలో కనిపించి సర్ ప్రైజ్ చేయనుందని తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం ఈ మూవీ టైటిల్ ని మేకర్స్ ప్రకటించనున్న విషయం తెలిసిందే.