దుబాయ్లో ఖరీదైన సొంత ఇళ్లు ఉన్న స్టార్లు

ఆకాశహార్మ్యాలతో విలాసాల స్వర్గాన్ని తలపించే దుబాయ్ లో సొంతంగా ఇల్లు కొనుక్కోవడం అంటే ఆషామాషీనా? సామాన్య మధ్యతరగతి కలల్లో కూడా ఇలాంటిది ఊహించలేరు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దాదాపు 1400 కోట్లతో దుబాయ్ లో విలాసవంతమైన భవంతిని కొనుగోలు చేశారని అప్పట్లో కథనాలొచ్చాయి. ఆయన మాత్రమే కాదు.. బాలీవుడ్ లో కోట్లాది పారితోషికాలు అందుకుంటున్న ప్రముఖ హీరోలు హీరోయిన్లు నిర్మాతలు కూడా దుబాయ్ లో సొంత ఇంటిని కొనుక్కున్న వారి జాబితాలో ఉన్నారు.

దుబాయ్ అంటేనే విలాసాల స్వర్గం. అక్కడ భవంతుల అందమైన ఆర్కిటెక్చర్… రయ్ రయ్ మని జెట్ స్పీడ్ తో దూసుకుపోయే వేగవంతమైన కార్లు .. ఎటు చూసినా ఆకాశ హార్మ్యాలు..అద్భుతమైన నోరూరించే ఆహారం వెరైటీలు.. వీటన్నిటికీ దుబాయ్ నిలయం. కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్- వెటరన్ నటుడు అనిల్ కపూర్ .. అందాల నటి శిల్పాశెట్టి కుంద్రా సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు దుబాయ్ లో ఇళ్లు కొనుగోలు చేశారు.

కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ ”కె ఫ్రండ్ ఆఫ్ పామ్ జుమేరా”లో ఒక విల్లాను సొంతం చేసుకున్నాడు. ఇది దుబాయ్ కి చెందిన ప్రాపర్టీ డెవలపర్ అయిన నఖీల్ నుండి బహుమతిగా అందింది. షారూఖ్ కి దుబాయ్ రెండవ ఇల్లు లాంటిది. అతని కుటుంబంతో నిరంతరం అక్కడికి విహారయాత్రకు వెళ్లడానికి ఇష్టపడతాడు.

బాలీవుడ్ హాటెస్ట్ కపుల్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ -అభిషేక్ బచ్చన్ దుబాయ్ లో విలాసవంతమైన ఇంటి యజమానులు. ఆ ఇద్దరూ అభయారణ్యం జలపాతం వద్ద ఒక సొంత భవనాన్ని కలిగి ఉన్నారు. ఇందులో ఛాంపియన్ షిప్ గోల్ఫ్ కోర్సు.. భారీ స్విమ్మింగ్ పూల్ సహా ఇంకా ఎన్నో విలాసాలు అందుబాటులో ఉన్నాయి.

అందాల శిల్పాశెట్టి 2016లో బుర్జ్ ఖలీఫాలోని రెండు పడకగదుల అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసింది. తన భర్త పిల్లలతో కలిసి శిల్పాజీ తరచుగా దుబాయ్ కి వెళ్తుంటారు. దుబాయ్ నగరంలో ఖరీదైన ప్యాడ్ ని కలిగి ఉన్నారు.

బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ భారీ భవంతి రిట్జ్ లో రెండు పడక గదుల ఫ్లాట్ ను బుక్ చేయడం ద్వారా దుబాయ్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టారు. అతను ఆకాశహార్మ్యాల నగరాన్ని అమితంగా ప్రేమిస్తాడు. అతని భార్య సునీతా కపూర్ ఈ ఇంటి ఒప్పందాన్ని ఆమోదించారు.

బాలీవుడ్ కండల హీరో సల్మాన్ సోదరుడు.. నటుడు సోహైల్ ఖాన్ 2013లో దుబాయ్ లో ఒకే అంతస్తులో అనేక అపార్ట్ మెంట్ల ను కొనుగోలు చేశాడు. ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ లోని ఒక కథనం ప్రకారం.. సోహైల్ దుబాయ్ సిగ్నేచర్ రెసిడెన్స్ లోని అపార్ట్మెంట్లను కుటుంబ పెట్టుబడిగా కొనుగోలు చేశాడు.

ఇక దుబాయ్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టిన టాలీవుడ్ హీరోలు కూడా ఉన్నారు. కానీ వారి పేర్లు ఎప్పుడూ బయటకు రాలేదు. సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీ దుబాయ్ లో ఒక ప్రయివేట్ ల్యాండ్ కొనుక్కున్నారని అప్పట్లో ఓ ప్రముఖ న్యూస్ చానెల్ లో కథనాలొచ్చాయి. కానీ దానిపై పూర్తి స్పష్టత లేదు. ప్రతియేటా తన కుటుంబంతో మహేష్ దుబాయ్ ట్రిప్ వెళ్లేందుకు ఎల్లపుడూ ఆసక్తిగా ఉంటారన్నది తెలిసిందే.