గోల్డెన్ గ్లోబ్ తర్వాత జపాన్ అకాడెమీ అవార్డ్

SS రాజమౌళి భారతదేశ కీర్తి పతాకను ప్రపంచ సినీయవనికపై సగర్వంగా ఎగురవేస్తున్న తీరు సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. దర్శకధీరుని ప్రతిభతోనే నేడు భారతీయ సినిమా విశ్వవ్యాప్తంగా వెలుగులు విరజిమ్ముతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్.ఆర్.ఆర్ అభిమానులు ఆస్కార్స్ 2023 నామినేషన్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని దక్కించుకోవడం ఉత్కంఠను పెంచుతోంది. ఇంతలోనే ఈ భారీ ఎపిక్ పీరియడ్ డ్రామా జపాన్ అకాడమీ అవార్డును గెలుచుకుని సంచలనం సృష్టించింది.

ఈ చిత్రం ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో జపనీ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డును 10 మార్చి 2023న అందజేయనున్నారు. గత ఏడాది జపాన్ లో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చినప్పుడు RRR త్రయం – రాజమౌళి- జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ లు తమ సినిమాని ఎంతో ఉత్సాహంగా ప్రమోట్ చేసారు.

అవార్డును గెలుచుకోవడంతో పాటు RRR జపాన్ బాక్సాఫీస్ వద్ద 650 మిలియన్ యెన్ లకు పైగా వసూలు చేసిన అతిపెద్ద భారతీయ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పట్లో RRR వసూళ్ల పరంగా నెమ్మదించే సూచనలు కనిపించడం లేదనేది జపాన్ ట్రేడ్ టాక్. అక్టోబర్ 2022న విడుదలైనప్పటి నుండి జపాన్ థియేటర్లలో 417K వసూళ్లతో ఫుట్ ఫాల్ సాధించిందని నిర్మాత చెప్పారు.

21 అక్టోబర్ 2022న విడుదలైనప్పటి నుండి గోల్డెన్ గ్లోబ్ అందుకున్న తర్వాతా జపాన్ లోని థియేటర్లలో విడుదలై అద్భుతమైన ప్రదర్శనతో అదరగొడుతోంది. ఈ మూవీ టికెటింగ్ కి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ చిత్ర నిర్మాతలే మేనేజ్ చేస్తుండడంతో కలెక్షన్ల వివరాలు స్పష్ఠంగా వెల్లడవుతున్నాయి.

ఈ చిత్రం జపాన్ డాల్బీ థియేటర్లలో జనవరి 20న విడుదలైంది. పాపులర్ వెబ్ సైట్ వెరైటీ నివేదిక ప్రకారం.. జపాన్ లోని అధికారిక పంపిణీదారు కీజో కబాటాకు చెందిన ట్విన్ కో లిమిటెడ్ రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రం దేశంలోని 319 ప్రీఫెక్ట్ స్క్రీన్ లు అన్ని నగరాల్లో 319 ఐ4 స్క్రీన్ లలో అలాగే ఇతర స్క్రీన్లలో విడుదల చేసింది. రాజమౌళి- రామ్ చరణ్-జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని ప్రచారం చేయడం కలిసొచ్చింది.

మొదటి వారంలో JPY73 మిలియన్ల ($495 000) కలెక్షన్ లు వచ్చాయని నివేదిక అందింది. ఇది జపాన్ లో ఒక భారతీయ చిత్రానికి అత్యధిక మొదటి-వారం కలెక్షన్ గా నిలిచింది. జపాన్ లో రాజమౌళి బ్లాక్ బస్టర్ లను ఆదరించడం ప్రశంసలు అందుకోవడం ఇదే మొదటిసారి కాదు.

2017 బ్లాక్బస్టర్ `బాహుబలి 2: ది కన్ క్లూజన్` భారీ వసూళ్లను సాధించింది. ఆ రికార్డులను ఆర్.ఆర్.ఆర్ అధిగమించింది. ఈ ఏడాది ఆర్.ఆర్.ఆర్ పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి `నాటు నాటు` పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్-మోషన్ పిక్చర్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును సాధించారు.