అంతా కలిసి రాజమౌళి గాలి తీసేశారు!

ఏదైనా పని మొదలుపెడితే దానికి వందశాతం న్యాయం చేయాలనుకుంటాడు రాజమౌళి. అది అతడి నైజం. అలాంటి వ్యక్తికి ఓ పని అప్పగిస్తే హ్యాపీగా ఉండొచ్చు. పని పూర్తయిపోతుందని పక్కాగా అనుకోవచ్చు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో కూడా ఇలానే జరుగుతుందని అంతా ఊహించారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అతడి సహచర గణం మొత్తం రాజమౌళి గాలి తీసేసింది. అతడి పేరు వాడుకొని సలహాల్ని పక్కనపడేసింది.

అమరావతి విషయంలో నార్మన్ ఫోస్టర్ అందించిన డిజైన్లపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ఈ డిజైన్లకు నేటివిటీ టచ్ ఇవ్వడం కోసం రాజమౌళిని రంగంలోకి దింపారు. పాపం రాజమౌళి, బాబుగారు చెప్పిన వెంటనే రీసెర్చ్ మొదలుపెట్టాడు. ఎంతో హోంవర్క్ చేసి ప్రజెంటేషన్స్ తయారుచేసుకున్నాడు.

సీఆర్ డీఏ అధికారులు, పలువురు మంత్రులతో కలిసి లండన్ వెళ్లిన రాజమౌళి నార్మన్ ఫోస్టర్ సభ్యులకు తన ప్రజెంటేషన్ ఇచ్చాడు. అసెంబ్లీ ఎలా ఉండాలనే విషయంతో పాటు తెలుగుజాతి చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని వాళ్లకు వివరించాడట. జక్కన్న ప్రజెంటేషన్ పై నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు చాలా సంతృప్తి వ్యక్తంచేశారు. అతడి సూచనలకు అనుగుణంగా కొన్ని డిజైన్ల లుక్ మార్చడానికి అంగీకరించారట.

అయితే ఇప్పుడు వ్యవహారం మళ్లీ మొదటకొచ్చింది. తెరవెనక ఏం జరిగిందో తెలీదు కానీ గతంలో నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్లనే గంపగుత్తగా ఆమోదించాలని చంద్రబాబు నిర్ణయించారట. మరి ఈ మాత్రం దానికి రాజమౌళిని పిలవడం, అతడితో ప్రజెంటేషన్స్ ఇప్పించడం ఎందుకో అర్థం కాలేదు.

రాజమౌళి చెప్పిన మార్పుచేర్పులు చంద్రబాబుకు నచ్చలేదు అనుకోవాలా లేక జక్కన్న చెప్పిన మార్పులు కంటే పాత డిజైన్లే బాబుకు నచ్చాయా. కారణం ఏదైనా ఇక్కడ బద్నామ్ అయింది మాత్రం రాజమౌళి. ఇందులోకి లాగకుండా ఉన్నట్టయితే ఈపాటికి ఎంచక్కా మరో సినిమా ప్రకటించి ఆ పని చూసుకునేవాడు. పాపం.. రాజమౌళి!