ముఖేష్ అంబానీ -నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ఇటీవల గుజరాత్ జామ్‌నగర్‌లో తమ ప్రీవెడ్డింగ్ వేడుకలను జరుపుకున్నారు. ఈ ఖరీదైన వేడుక భారతదేశాన్ని మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలను ఆకర్షించింది. ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1-3 వరకు 3 రోజుల పాటు జరిగాయి. ఇందులో గ్లోబల్ టెక్ సీఈఓలు, బాలీవుడ్ స్టార్లు, పాప్ ఐకాన్లు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. వేడుక కోసం ప్రముఖులంతా గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చేరుకుని సందడి చేసారు. ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా, ఆనంద్ పిరమల్, కోకిలాబెన్ అంబానీ సహా మొత్తం అంబానీ వంశం కూడా వివాహానికి హాజరయ్యారు.
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, మెటా హెడ్ మార్క్ జుకర్‌బర్గ్, ఇవాంకా ట్రంప్ సహా డజన్ల కొద్దీ ఇతర ప్రముఖులు విలాసవంతమైన పరిసరాలలో నోరూరించే ఫీస్ట్ ఫుడ్ ని ఆస్వాధించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా నిర్మించిన విలాసవంతమైన వసతి గృహంలో వీరంతా ఉన్నారు. పాప్ ఐకాన్ రిహన్నా సారథ్యంలో వినోదం పొందారు. రెండు గంటల ప్రోగ్రామ్ కోసం $6 మిలియన్ (సుమారు రూ. 52 కోట్లు) లు ఖర్చు చేసారని అంచనా. అయితే కొన్ని మీడియాలు రిహానాకు సుమారు 70కోట్ల పారితోషికం ఇచ్చారని కూడా కథనాలు వెలువరించాయి.
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో భాగంగా మొత్తం 3-రోజుల ఉత్సవాలకు రూ. 1260 కోట్లు ఖర్చు చేసినట్లు కథనాలొస్తున్నాయి. ఫోర్బ్స్ ప్రకారం.. ముఖేష్ అంబానీ నికర ఆస్తి విలువ 117 బిలియన్ డాలర్లు (రూ. 97,66,89,81,30,000).
అంబానీలు ఈ వేడుక కోసం ప్రత్యేకించి కేటరింగ్ కాంట్రాక్టుకే రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. వేడుకలో జెఫ్ లీథమ్ ఈవెంట్లో ఖరీదైన పూల సెటప్ ఏర్పాట్లకు బాధ్యత వహించాడు. అతడు రియాలిటీ టీవీ స్టార్.. వ్యాపారవేత్త. కిమ్ కర్దాషియాన్ అలాగే ఆమె కుటుంబంలోని మిగిలిన వారితో కలిసి పని చేసిన వ్యక్తిగా పాపులరయ్యాడు. అతడు అంబానీల ప్రీవెడ్డింగ్ ఏర్పాట్లకు సహకరించాడు.
అంబానీల ప్రీ వెడ్డింగ్ వేడుకకు వచ్చిన భారతీయ అంతర్జాతీయ అతిథుల కోసం ముఖేష్ అంబానీ ప్రైవేట్ విమానాలను కూడా ఏర్పాటు చేశారు. దీనికోసం భారీగా ఖర్చు చేసారు. అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ జనవరి 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఏడాది జూలైలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.