అజ్ఞాతవాసి లాగే కిర్రాక్ పార్టీ?

సినిమా విడుదలకు ముందుగా ట్రయిలర్ వదలడం ఆనవాయితీ. సినిమా మీద ప్రేక్షకులకు ఓ అంచనా రావడం కోసం ట్రయిలర్ ఉపయోగపడుతుంది. సాధారణంగా వారం రోజుల ముందుగా ట్రయిలర్ వదులుతుంటారు. డైరక్టర్ వీర బిజీ అయిపోయినా, పబ్లిసిటీకి టైమ్ లేకపోయినా, కనీసం రోజుల ముందు అయినా ట్రయిలర్ వదులుతారు.

కానీ అస్సలు ట్రయిలర్ లేకుండానే బరిలోకి వచ్చింది ఆ మధ్య అజ్ఞాతవాసి సినిమా. దర్శకుడు త్రివిక్రమ్ కు తన సినిమా మీద ఓవర్ కాన్ఫిడెన్స్ వుండడం, పవన్-త్రివిక్రమ్ అంటే చాలు జనాలు పరుగెత్తుకు వచ్చి క్యూల్లో నిల్చునిపోతారు అనే ధైర్యం వుండడంతో వాళ్లు అలా చేసారు.

ఇప్పుడు మరో హీరో నిఖిల్ సినిమాకు కూడా ఇలాగే చేస్తున్నట్లు కనిపిస్తోంది. కిర్రాక్ పార్టీ సినిమా విడుదల వారం రోజుల రేంజ్ లోకి వచ్చింది ఇప్పటి వరకు ట్రయిలర్ జాడ లేదు. పాటలు సింగిల్స్ వదలడంతోనే సరిపొతోంది వ్యవహారం. మార్కెట్ లో రెండు వారాలుగా సినిమాలు లేకపోవడం, మరో వారం కూడా ఇదే పరిస్థితి వుండేలా కనిపించడం, పోటీగా మరో సరైన సినిమా లేకపోవడంతో ఓపెనింగ్స్ కు ఢోకా లేదన్న దీమా వచ్చేసింది కిర్రాక్ పార్టీ యూనిట్ కు.

మరి ఓపెనింగ్స్ కు ఢోకా లేనపుడు ట్రయిలర్ తో పనేమిటి? పైగా ట్రయిలర్ వదిలి, అది బాగుంది, లేదా బాగులేదు ఇలాంటి టాక్ ను తీసుకురావడం అవసరమా? అందుకే ట్రయిలర్ ను వదలాలా? వద్దా? అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు కిర్రాక్ పార్టీ జనాలు. కానీ అజ్ఞాతవాసి అంటే పెద్ద సినిమా కాబట్టి చెల్లుబాటు అయింది. కానీ కిర్రాక్ పార్టీ అలా కాదుగా. జనాలను మరింత అట్రాక్ట్ చేయాలంటే ట్రయిలర్ బయటకు రావాలిగా?