అయ్య‌య్యో…హీరో సూర్యపై కోర్టు ధిక్క‌ర‌ణ ఫిర్యాదు

దేశంలోని న్యాయ‌మూర్తుల‌ను, న్యాయ వ్య‌వ‌స్థ‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడి త‌మిళ హీరో సూర్య‌ కోర్టు ధిక్క‌ర‌ణకు పాల్ప‌డ్డారంటూ చెన్నై హైకోర్టు న్యాయ‌మూర్తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు సూర్య‌పై కోర్టు ధిక్కార‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి న్యాయ‌మూర్తి ఎస్ఎం సుబ్ర‌మ‌ణ్యం లేఖ రాశారు. అస‌లు వివాదం ఎక్క‌డ మొదలైంది, ఎందుకు మొదలైందో తెలుసుకుందాం.

కరోనా కాలంలో నీట్ పరీక్షలు నిర్వహిస్తుండ‌డం, ఇత‌ర విద్యావిధానాల‌తో భయం, ఒత్తిడి కారణంగా తమిళనాడులో ఒకేరోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఈ ఘటనలు త‌మిళ హీరో సూర్య‌ను క‌దిలించాయి. కరోనా భయంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయ విచార‌ణ‌లు చేస్తున్న గౌరవ న్యాయమూర్తులు … విద్యార్థులను మాత్రం భయం లేకుండా నీట్ పరీక్షకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేయడం విడ్డూరమని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

ఇలాంటి పరీక్షలను ‘మనునీతి పరీక్షలు’గా అభివర్ణించిన సూర్య వీటివల్ల విద్యార్థుల జీవితాలను బలి తీసుకోవడం తప్ప ఒరిగే దేమీ ఉండదని వ్యాఖ్యానించారు. విద్యార్థుల‌ ఆత్మహత్యలు తల్లిదండ్రులకు జీవితకాల శిక్షగా మారతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, కోర్టులు క్రూరంగా వ్యవహరిస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. ఈ నేప‌థ్యంలో సూర్యను నెటిజ‌న్లు, ఇత‌ర‌త్రా వ‌ర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. అలాగే సోషల్ మీడియాలో ఆయ‌న అభిప్రాయాలకు సంబంధించిన పోస్ట్‌ వైరల్ అయ్యింది.

మీడియా, యూట్యూబ్‌లో నీట్ ప్రవేశ పరీక్షలపై సూర్య ప్రకటనను చూశానని జస్టిస్ ఎస్.ఎమ్. సుబ్రమణ్యం చెప్పారు. సూర్య వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఆయనపై కోర్టు ధిక్కార చర్యల్ని కోరుతూ ప్రధాన న్యాయమూర్తి అమ్రేశ్వర్ ప్రతాప్ సాహికి లేఖ రాశారు. సూర్య కామెంట్స్ న్యాయవ్యవస్థను కించపర్చేవిగా ఉన్నాయ‌ని, ఆయనపై చర్య తీసుకోవాలని కోరారు.

సూర్యపై ధిక్కార చర్యలు తీసుకుని ‘భారతీయ న్యాయ వ్యవస్థ ఘనతను చాటి చెప్పాలని’ ప్రధాన న్యాయమూర్తిని సుబ్రమణ్యం అభ్యర్థించారు. మ‌రి హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎలా స్పందిస్తారోన‌నే ఉత్కంఠ త‌మిళ‌నాడులో నెల‌కొంది.