అర్రె.. భారతీయుడు తెలుగు మల్టీస్టారర్.. భలే మిస్సైందే..?

ఎలాంటి సినిమా చేసినా ఎలాంటి పాత్ర పోషించినా ప్రేక్షకుల్లో అలా గుర్తిండిపోయేలా చేయడంలో లోకనాయకుడు కమల్ హాసన్ ఒకరు. ఆయన చేసిన 200 పైగా సినిమాల్లో ఏ పాత్ర మరొక పాత్రకు దగ్గరగా ఉండదు. అంత విలక్షణ చూపిస్తారు కాబట్టే ఆయన్ను వెండితెర ఉలగనాయకన్ అని అంటుంటారు. ఈమధ్యనే కల్కి సినిమాలో సుప్రీం యాస్కిన్ పాత్రలో వర్సటాలిటీ చూపించిన కమల్ రెండు రోజుల్లో ఇండియన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

శంకర్ డైరెక్షన్ లో కమల్ హీరోగా తెరకెక్కిన ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 వస్తుంది. 1996 మే 9న రిలీజైన ఇండియన్ అదే భారతీయుడు భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్ గా నిలిచింది. అప్పటి సామాజిక అంశాల మీద అవినీతి మీద శంకర్ మార్క్ సినిమాగా వచ్చిన ఇండియన్ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అప్పటికే జెంటిల్మన్ తో సూపర్ అనిపించుకున్న ఆయన ఓ పక్క ప్రేమికుడు తీస్తూనే ఇండియన్ కథ రాసుకున్నారు.

ఐతే జెంటిల్మన్ చూశాక రజినికాంత్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేయాలని అనుకున్నారు. ఆ టైం లోనే పరియ మనుషన్ అనే స్క్రిప్ట్ సిద్ధం చేశారు శంకర్. ఆ టైం లో రజిని సినిమా చేయడం కుదరకపోవడంతో ఆ కథనే కాస్త మార్చి కమల్ తో చేశారు. కమల్ హాసన్ తో భారతీయుడు చేయడానికి ముందు తెలుగు హీరోలు రాజశేఖర్, వెంకటేష్ లతో ఈ సినిమా తీయాలనుకున్నారట శంకర్. సేనాపతిగా రాజశేఖర్, ఆయన కుమారుడిగా వెంకటేష్ ని తీసుకోవాలని అనుకున్నారట. ఐతే ఆ ప్రయత్నాలు కూడా ఎందుకో ముందుకు వెళ్లలేదు.

అంతేకాదు కోలీవుడ్ లో కార్తీక్, సత్యరాజ్ లతో కూడా ఇండియన్ సినిమా చేయాలని అనుకున్నారట. కానీ ఏ సినిమా ఎవరికి పడాలని ఆల్రెడీ ముందే రాసి ఉంటుంది. అలానే కమల్ హాసన్ కి కథ చెప్పడం ఆయన ఓకే అనడంతో పాటు రెండు పాత్రలు ఆయనే చేయడం జరిగింది. అప్పటిలోనే సేనాపతి పాత్ర మేకప్ కు గంటల కొద్దీ కమల్ మేకప్ వేసుకునే వారు. కమల్ సేనాపతి మేకప్ వేసింది ఆస్కార్ విన్నర్ హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ మైఖెల్ వెస్ట్ మోర్.

ఈ సినిమా కోసం శంకర్ చాలా హార్డ్ వర్క్ చేశారు. సుభాష్ చంద్రబోస్ ఒరిజినల్ డాక్యుమెంట్ లోని పుటేజ్ ని తీసుకుని వాటిల్లో కమల్ హాసన్ ని చూపించారు. అప్పట్లోనే ఆయన ఈ టెక్నాలజీని ఉపయోగించడం విశేషం. ఇక హీరోయిన్స్ గా ఐశ్వర్య రాజేష్ చేయాల్సి ఉన్నా ఆమె కుదరకపోవడంతో బొంబాయి సినిమా చూసి మనీషా కొయిరాలాకు ఆ ఛాన్స్ ఇచ్చారు శంకర్. ఇండియన్ సినిమా కోలీవుడ్ లో ఎవర్ గ్రీన్ హిట్ సాధించగా బెస్ట్ యాక్టర్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్ విభాగాల్లో నేషనల్ అవార్డులను కైవసం చేసుకుంది.

ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా శంకర్ కమల్ మళ్లీ ఇన్నాళ్లకు ఇండియన్ 2 సినిమా తెరకెక్కించారు. శుక్రవారం రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాపై సూపర్ బజ్ ఏర్పడింది. మరి భారతీయుడు రేంజ్ లో భారతీయుడు 2 ఉంటుందా లేదా అన్నది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది.