ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడంతో, హైద్రాబాద్ నుంచి తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లోని ఏదో ఒక ప్రాంతానికి తరలి వెళ్ళడం ఖాయమనే ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే, ‘తెలుగు సినీ పరిశ్రమ ఎక్కడికీ వెళ్ళదు.. హైద్రాబాద్‌లోనే వుంటుంది..’ అంటూ తెలుగు సినిమాకి భరోసానిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ‘ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ కేంద్రంగా తెలుగు సినీ పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందేందుకు చర్యలు తీసుకుంటాం..’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చెప్పుకొచ్చింది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు సర్కార్, సినీ పరిశ్రమ విషయమై మాటలు తప్ప, చేతల్లో ఏమీ చూపించలేకపోయింది.
వరుసగా మూడేళ్ళకుగాను ఒకేసారి ‘నంది’ పురస్కారాల్ని చంద్రబాబు సర్కార్ ప్రకటించేసింది. ‘ఇవ్వకపోయినా బాగుండేదేమో..’ అన్నంతలా, ‘నంది’ అవార్డులు వివాదాస్పదమయ్యాయి. అంతే, ‘ఏపీలో ఆధార్ కార్డు లేనివారు.. ఓటు హక్కు కూడా లేనివారు విమర్శిస్తున్నారు..’ అంటూ ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ నుంచి ఒకింత ‘చులకన’ మాటలు తెరపైకొచ్చాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి తనయుడు, పైగా మంత్రి కూడా అయిన నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మొత్తంగా చూస్తే, సినీ పరిశ్రమ అవసరం ఆంధ్రప్రదేశ్‌కి లేదన్నట్టుగా వుంది ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నడుపుతున్న టీడీపీ తీరు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనేని పిలిచి ‘సోషల్ సమ్మిట్’లో ఘనంగా సన్మానించి, ‘పబ్లిసిటీ’ చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగు సినీ ప్రముఖుల విషయంలో ఇంత చులకనగా ఎలా వ్యవహరించగలిగింది.? అన్న ప్రశ్న తెలుగు సినీ ప్రముఖుల్ని కలచివేస్తోంది.
టీడీపీలో మురళీమోహన్, బాలకృష్ణ, శివప్రసాద్ తదితర సినీ ప్రముఖులు ప్రజా ప్రతినిథులుగా వున్నారు. వాళ్ళయినా, నంది పురస్కారాల విషయమై తలెత్తుతున్న వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేయడంలేదు.. ప్రభుత్వం నుంచి వస్తున్న ‘చులకన’ మాటల్నీ ఆపలేకపోతున్నారు. ఎలా ఆపుతారు.? ఎలా ప్రయత్నం చేస్తారు.? అక్కడ ‘నంది’ రచ్చ షురూ అయ్యిందే, బాలకృష్ణ సినిమా ‘లెజెండ్’ కారణంగా అయినప్పుడు.!
ఒక్కటి మాత్రం నిజం.. తెలుగు సినిమాకి చంద్రబాబు సర్కార్ ఇచ్చే ప్రోత్సాహకాలు పెద్ద విషయమే కాదు. ‘రుద్రమదేవి’ సినిమానే తీసుకుంటే, తెలంగాణ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చిందిగానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వలేదాయె. బావమరిది కావడంతో బాలయ్య సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’కి మాత్రం పన్ను మినహాయింపు ఇచ్చుకుంది. ఆ లెక్కన, ఆ తరహా వెసులుబాట్లను తెలుగు సినీ పరిశ్రమ ఆశించే పరిస్థితి లేదు.
కానీ, సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లోనూ అభివృద్ధి చెందితే.. పన్నులు సహా, చాలా విషయాల్లో సర్కారీ ఖజానాకి కొంత ‘ఊపు’ అయితే వస్తుంది. అయినా, ఎందుకింత నిర్లక్ష్యం.? విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నడుపుతున్న ప్రభుత్వం, సినీ పరిశ్రమని ఇంత చిన్నచూపు చూడటమా.? కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది.