‘ఆచార్య’ తొలి చూపు ఆ రోజే..

ఖైదీ నంబర్ 150’తో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’తో తన దీర్ఘ కాలిక కలను నెరవేర్చుకున్న మెగాస్టార్ చిరంజీవి.. మళ్లీ తన పాత స్టయిల్లో కొరటాల శివ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ఆచార్య’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతుండగా.. ఇటీవల ‘ఓ పిట్టకథ’ సినిమా వేడుకలో అనుకోకుండా చిరంజీవే ఈ టైటిల్‌ను అనధికారికంగా బయటపెట్టేశాడు. ఇక ఆ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించడమే తరువాయి.

టైటిల్ విషయంలో సస్పెన్స్ వీడిపోవడంతో ఇక ఫస్ట్ లుక్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆ ముచ్చట తీర్చే రోజు అతి త్వరలోనే ఉన్నట్లు సమాచారం. తెలుగు సంవత్సరాది ఉగాది కానుకగా ‘ఆచార్య’ టైటిల్ లోగోతో పాటు ఫస్ట్ లుక్ లాంచ్ చేయడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్ చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. కాబట్టి విడుదలకు నాలుగు నెలల ముందు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం కరెక్ట్ టైమింగ్ అని భావిస్తున్నారు

. ఉగాదిని తెలుగు వాళ్లు ప్రత్యేకంగా భావిస్తారు కాబట్టి ఆ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేస్తే శుభప్రదంగానూ ఉంటుందని కొరటాల టీం అనుకుంటోంది. ఇక ఈ చిత్రంలో చిరు సరసన త్రిష ఓ కథానాయికగా నటించనున్నట్లు వార్తలొస్తుండగా.. ఇందులో ఓ కీలక పాత్రలో మహేష్ బాబు కనిపిస్తాడని గట్టిగానే ప్రచారం జరుగుతోంది. కానీ ఈ వార్తలపై ఇంకా అధికారిక సమాచారమైతే లేదు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్నందిస్తున్నాడు.