ఆర్ఆర్ఆర్ టైటిల్.. ఏమిటీ కన్ఫ్యూజన్?

సాధారణంగా రాజమౌళి తన సినిమాలకు ముందే టైటిల్ ప్రకటించి ఆ తర్వాత చిత్రీకరణ ఆరంభిస్తుంటాడు. ‘సింహాద్రి’ లాంటి ఒకటీ అరా సినిమాలకు మాత్రమే టైటిల్ ప్రకటన కొంచెం ఆలస్యంగా జరిగింది. ‘బాహుబలి’ లాంటి మెగా మూవీకి కూడా ముందే టైటిల్ అనౌన్స్ చేసి తర్వాత షూటింగ్ ఆరంభించాడు. కానీ దాని తర్వాత కొత్త సినిమాకు మాత్రం టైటిల్ ఖరారు చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు.

ముందు ఇద్దరు హీరోలతో పాటు తన పేరు కలిసొచ్చేలా ‘ఆర్ఆర్ఆర్’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టిన జక్కన్న.. గత ఏడాది ఇదే సమయంలో పెట్టిన ప్రెస్ మీట్లో ఈ అక్షరాలు కలిసొచ్చేలాగే టైటిల్ ఉంటుందని ప్రకటించాడు. అభిమానులు కూడా ఏవైనా పేర్లు సూచించవచ్చని పిలుపునిచ్చాడు.

ఐతే చిత్ర బృందమే పేరు పెట్టిందో.. అభిమానుల సూచనల్లోంచి పేరు తీసుకుందో కానీ.. మొత్తానికి తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే పేరును ఖరారు చేశారు. ఐతే అన్ని భాషల్లోనూ ఒకే పేరు ఉంటుందని గత ఏడాది ప్రకటించిన జక్కన్న.. ఆ మాట నిలబెట్టుకోలేకపోయాడు. తెలుగు టైటిల్‌లోని పదాలే వేరే భాషలకు వచ్చేసరికి అటు ఇటుగా మారడమేంటో అర్థం కావడం లేదు. తమిళంలో ఈ చిత్రానికి ‘రథం రౌద్రం రణం’ అని పేరు పెట్టారు.

మలయాళంలో ఏమో ‘రుధిరం రణం రౌద్రం’ అన్నారు. కన్నడలో మాత్రం తెలుగు వెర్షన్‌ను పోలినట్లే ‘రౌద్ర రణ రుధిర’ అని పెట్టారు. హిందీలోకి వచ్చేసరికి ‘రైజ్ రోర్ రివోల్ట్’ అంటూ ఇంగ్లిష్ టైటిల్ పెట్టారు. లోకల్ టైటిళ్లతో పోలిస్తే హిందీలో పెట్టిన పేరుకు వచ్చే అర్థం వేరుగా ఉంది. మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ విషయంలో చిత్ర బృందంలోనే పెద్ద కన్ఫ్యూజన్ ఉన్నట్లు స్పష్టమవుతోంది.