ఆర్నాల్డ్ తప్పుకోవడంపై శంకర్ క్లారిటీ

2.0 సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని అనుకున్నప్పుడు రజనీకాంత్ తర్వాత వినిపించిన పేరు హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ ష్వాజ్ నెగర్. టెర్మినేటర్ సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్నాల్డ్.. 2.0 విలన్ పాత్రకు సరిపోతాడని శంకర్ భావించాడు. కానీ ఇందులో నటించేందుకు ఆర్నాల్డ్ ఇంట్రెస్ట్ చూపించలేదు. దీనిపై ఎట్టకేలకు వివరణ ఇచ్చాడు శంకర్.

“2.0 సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాం. ఇందులో సందేశం కూడా గ్లోబల్ గా ప్రతి ఒక్క ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఆర్నాల్డ్ ను సంప్రదించడానికి కారణం ఇదే. ఆర్నాల్డ్ మేనేజర్స్ తో చాలాసార్లు సంప్రదింపులు జరిపాం. కానీ మేం అనుకున్నట్టు జరగలేదు. అప్పటికే ఒప్పుకున్న కమిట్ మెంట్స్ కారణంగా ఆర్నాల్డ్ మా సినిమాలో నటించలేదు” దుబాయ్ లో జరిగిన 2.0 ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ లో శంకర్ వివరణ ఇది.

అయితే ఆర్నాల్డ్ కు ఏమాత్రం తీసిపోని నటుడు అక్షయ్ కుమార్ రూపంలో తమకు దొరికాడని అంటున్నాడు శంకర్. థియేటర్లలో 2.0 సినిమా చూసిన ప్రేక్షకులకు ఆర్నాల్డ్ గుర్తుకురాడని, అక్షయ్ కుమార్ అంతలా తన యాక్టింగ్ లో మెస్మరైజ్ చేశాడని అంటున్నాడు. జనవరి 25న 2.0 సినిమా థియేటర్లలోకి రానుంది.