ఆల్‌ ఫ్రీ బాబు: లైట్‌ మెట్రో ఫ్రీ ఫ్రీ ఫ్రీ.!

అదేంటో చంద్రబాబుని చూస్తే, అన్నీ ఉచితంగా ఇచ్చేయాలనిపిస్తుంటుంది కొందరికి. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ని సింగపూర్‌ ‘ఫ్రీ’గానే ఇచ్చేసింది. ఇదంతా చంద్రబాబుకి వున్న క్రెడిబులిటీ కారణంగానే జరిగింది. అమరావతి డిజైన్లకు సంబంధించి ప్రపంచ స్థాయి సంస్థలు కూడా డిజైన్లను ‘ఫ్రీ’గానే ఇచ్చేస్తున్నాయట. తాజాగా విజయవాడ లైట్‌ మెట్రో కోసం జర్మనీకి చెందిన ఓ సంస్థ ‘ఫ్రీ’గా డీపీఆర్‌ తయారు చేయించి ఇచ్చేస్తోందటండోయ్‌.!

‘వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే..’ అన్న చందాన తయారయ్యింది పరిస్థితి. ‘నన్ను చూసి సింగపూర్‌ ఉచితంగానే మాస్టర్‌ ప్లాన్‌ అందిస్తోంది..’ అని చంద్రబాబు చెప్పుకోవడం.. దానికి టీడీపీ అనుకూల మీడియా ‘బాకా’ ఊదడం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎవరన్నా ఏదన్నా ఊరికే ఎందుకు చేస్తారు.? ఛాన్సే లేదు. పైగా, కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఇలాంటి వ్యవహారాల విషయంలో ‘చంద్రబాబు దక్షత’ని చూసి ఉచితంగా చేసేయడమంటే హాస్యాస్పదం కాక మరేమిటి.?

ఆరు కోట్ల ఖర్చయ్యే డీపీఆర్‌ని జర్మనీ సంస్థ ఉచితంగానే తయారు చేయించి ఇచ్చేస్తోందే అనుకుందాం.. ఆ ప్రాజెక్ట్‌ని దక్కించుకుని, ఏ స్థాయిలో లాభాలు ఆర్జించేయాలని ఆ సంస్థ అనుకోవాలట.! ఇదంతా, ప్రాజెక్టు ఓకే అయి.. ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమయి, పూర్తయ్యాక కదా.. అసలు విషయం తేలుతుంది.?

అసలంటూ విజయవాడకు మెట్రో దండగ.. అని పలుమార్లు నిరూపితమయిపోయింది. ఎలాగోలా కేంద్రం వద్ద చంద్రబాబు పిల్లి మొగ్గలేసి మరీ మెట్రో ప్రాజెక్టు కోసం అనుమతులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నమాట వాస్తవం. అయితే, అంతలోనే ఆయన దాన్ని వివాదాల్లోకి లాగేస్తున్నారు. ఓ సారి మెట్రో అంటారు, ఇంకోసారి లైట్‌ మెట్రో అంటారు, మరోసారి మోనో రైల్‌ అంటారు.. ఇవేవీ కాదు, హైపర్‌ లూప్‌ అనీ మరోటనీ.. కొత్త కొత్త పేర్లను తెరపైకి తెస్తుంటారు.

అసలు విజయవాడకి ఏది కరెక్ట్‌.? ఏది వచ్చే అవకాశముంది.? అన్నదానిపైనే గడచిన మూడున్నరేళ్ళలో ఎటూ తేల్చుకోలేకపోయారాయె. ఇంత అసమర్థత చంద్రబాబులో కన్పిస్తున్నా, ఉచితంగా అన్నీ అందించేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చేస్తున్నాయంటే, అదేమన్నా నమ్మేలా వుందా.?