‘ఆ నలుగురు’ – రేసులో నిలిచేదెవరు.?

‘సూపర్‌ స్టార్‌’ రజనీకాంత్‌.. ‘తలా’ అజిత్‌.. విశ్వనటుడు కమల్‌హాసన్‌.. ‘ఇళయదళపతి’ విజయ్‌.. ఈ నలుగురూ తమిళ సినీ పరిశ్రమలో అగ్రహీరోలుగా చెలామణీ అవుతున్నారు. ఈ నలుగురిలో ఇద్దరు తమ రాజకీయ రంగ ప్రవేశంపై సీరియస్‌గా వున్నారు. ఒకరేమో, రాజకీయంగా ‘చిన్నపాటి’ ముందడుగు అయితే వేసేశారు. ఆయనే కమల్‌హాసన్‌. అప్పుడే ఆయన రాజకీయ ‘పోరాటం’ షురూ చేసేశారు.. వివాదాల్ని ఎదుర్కొంటున్నారు కూడా.!

ఇక, రజనీకాంత్‌ సంగతి సరే సరి. ఆయన, రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన మాట వాస్తవం. పార్టీ పెట్టేస్తున్నారంటూ అభిమానులు సందడి చేస్తున్న మాటా వాస్తవం. కానీ, ‘ముహూర్తం’ మాత్రం ఖరారు కావడంలేదు. కొత్త రాజకీయ పార్టీ పెడతారా.? బీజేపీతో కలిసి ముందడుగు వేస్తారా.? అన్నది ప్రస్తుతానికైతే మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. కొత్త రాజకీయ పార్టీ వైపుగానే రజనీకాంత్‌ ముందడుగు వేసే అవకాశాలున్నాయన్నది మెజార్టీ వాదన. ఒకవేళ కొత్త పార్టీ పెట్టినా, దాన్ని బీజేపీతో రజనీకాంత్‌ ‘లింకప్‌’ చేయడానికే అవకాశాలెక్కువ.

అజిత్‌ విషయానికొస్తే, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ వారసుడిగా వార్తల్లోకెక్కాడీ హీరో. అన్నాడీఎంకే పార్టీకి జయలలిత తర్వాత సారధి ఈయనేనని చాలామంది విశ్వసించారు కూడా. అయితే, జయలలిత మరణానంతరం రాజకీయాలకు సంబంధించి పూర్తిగా ‘స్తబ్దంగా’ వున్నాడు అజిత్‌. అయినాసరే, అన్నాడీఎంకే పార్టీకి ‘సినీ గ్లామర్‌’ అవసరమనుకుంటే మాత్రం అజిత్‌, రంగంలోకి దిగుతాడన్నది అజిత్‌ అభిమానుల వాదన.

తాజాగా ‘మెర్సల్‌’ సినిమాతో రాజకీయ తెరపై హీరో విజయ్‌ పేరు మార్మోగిపోతోంది. రాజకీయ రంగ ప్రవేశానికి వీలుగా ‘మెర్సల్‌’ సినిమాలో వ్యూహాత్మకంగానే పొలిటికల్‌ డైలాగుల్ని విజయ్‌ పెట్టించాడంటూ తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. బీజేపీతో తలపడేందుకు కొత్త రాజకీయ పార్టీ పెట్టడం లేదా ఏదన్నా రాజకీయ పార్టీకి మద్దతివ్వడం విజయ్‌ చేయొచ్చునన్నది అక్కడ బాగా విన్పిస్తోన్న మాట.

ఈ నలుగురూ కాదు.. ఇంకా చాలామంది సినీ ప్రముఖులు తమిళ రాజకీయాల్లో సందడి చేసే అవకాశముంది. విజయ్‌కాంత్‌ గతంలోనే పార్టీ పెట్టి, దాన్ని సరిగ్గా నడపలేక పిల్లిమొగ్గలేస్తోన్న విషయం విదితమే. నటుడు శరత్‌కుమార్‌ కూడా అంతే. విశాల్‌ కూడా అప్పుడప్పుడూ పొలిటికల్‌ డైలాగులు పేల్చుతుంటాడు. 2019 ఎన్నికల నాటికి విశాల్‌ సేవల్ని వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ పార్టీతోపాటు, డీఎంకే కూడా ప్రయత్నిస్తోందట.

మొత్తమ్మీద, తమిళ సినీ పరిశ్రమలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోందనే చెప్పాలి. ఇప్పటికైతే రాజకీయంగా ముందడుగు వేసింది ఒక్క కమల్‌హాసన్‌ అనే చెప్పుకోవాల్సి వుంటుంది. ఆయనా, పూర్తిస్థాయిలో రాజకీయంగా ముందడుగు వేయడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశముంది. చూద్దాం.. తమిళ సినీ రాజకీయం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరగనుందో.!