ఆ సింపతీ అక్కర్లేదంటోన్న ‘రాజా ది గ్రేట్‌’

మామూలుగా హీరో అంధుడిగా నటిస్తున్నాడంటే, ఆ హీరోకి చూపు వస్తే బావుంటుందన్న అభిప్రాయం సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకుల్లో కలుగుతుందనీ, ‘రాజా ది గ్రేట్‌’ సినిమాలో మాత్రం హీరో ఇంట్రడక్షన్‌ సీన్‌ నుంచే, ఆ అవసరం లేదనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలుగుతుందని చెబుతున్నారు ‘రాజా ది గ్రేట్‌’ హీరో రవితేజ, దర్శకుడు అనిల్‌ రావిపూడి. అసలు సినిమాలోనే కాదు, రియల్‌ లైఫ్‌లోనూ డిజేబులిటీతో బాధపడుతున్నవారిపై సింపతీ అవసరంలేదనీ, వారినీ తమతో సమానంగా ప్రతి ఒక్కరూ చూసి, గౌరవించాల్సిన అవసరం వుందని రవితేజ, దర్శకుడు అనిల్‌ అంటున్నారు.

కమర్షియల్‌ ఫార్మాట్‌లో సినిమాలు తీయడం అనిల్‌కి ఇష్టమంటున్న రవితేజ, కమర్షియల్‌ అంశాలతో సినిమా తెరకెక్కిస్తున్నా, అందులో కొత్తదనం కోసం పరితపించడంతోనే ఈ ‘రాజా ది గ్రేట్‌’ రూపొందిందనీ, దర్శకుడు అనిల్‌ కథ చెబుతున్నప్పుడే, నటించి చూపించేయడంతో సినిమాలో నటన తనకు మరింత తేలికయ్యిందని చెప్పాడు.

అన్నట్టు, అనిల్‌ రావిపూడికి మిమిక్రీతో బాగా పరిచయముందట. అదే ఈ సినిమాకి చాలా ప్లస్‌ అయ్యిందంటున్నాడు రవితేజ. నిజానికి ‘పటాస్‌’ సినిమా తానే చేయాల్సి వుందనీ, ఓ సిల్లీ రీజన్‌తో ఆ ప్రాజెక్ట్‌ చేజారిపోయిందని రవితేజ చెప్పుకొచ్చాడు. ఈ దీపావళికి ‘రాజా ది గ్రేట్‌’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే.

ఇక, ట్రైలర్‌లోనే హీరో క్యారెక్టరేజేషన్‌ ఏంటన్నది స్పష్టమయిపోయింది. సాధారణ మాస్‌ హీరో ఏమేం చేస్తాడో, అంధుడిగా కన్పించే రవితేజ కూడా ‘రాజా ది గ్రేట్‌’లో అన్నీ చేసేశాడు. అంధుడైతేనేం, అన్నీ చేయగలడన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కించడం ద్వారా సొసైటీకి మంచి సందేశం ఇవ్వబోతున్నామన్నది హీరో రవితేజ, దర్శకుడు అనిల్‌ రావిపూడి చెబుతోన్న మాట. ఈ సినిమాలో రవితేజ సరసన మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం విదితమే.