వాళ్లవి, వీళ్లవి అమ్మడం ఎందుకు.. మనమే సొంతంగా ఉత్పత్తి చేసి అమ్ముకోవచ్చుగా.. సరిగ్గా ఇదే ఆలోచన వచ్చింది ఫ్లిప్ కార్ట్ కి. ఎప్పట్నుంచో పేపర్ పై ఉన్న ఈ ఆలోచనను అమలు చేసే ప్రక్రియను ఈమధ్యే ప్రారంభించింది ఈ సంస్థ. సొంతంగా కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల్ని తయారుచేసి, తమ సొంత లేబుల్ పై సైట్ లో అమ్మడం స్టార్ట్ చేసింది
ఇప్పటికే మార్క్యూ (MarQ) పేరిట ఎల్ఈడీ టీవీలు తయారుచేసి ఆన్ లైన్ లో అమ్ముతోంది ఈ సంస్థ. మరో 4రోజుల్లో స్మార్ట్ ఫోన్ విభాగంలోకి కూడా ఎంటర్ అవుతోంది. తమ సైట్ లో ఎక్కువగా స్మార్ట్ ఫోన్లే అమ్ముడుపోతున్నాయనే విషయాన్ని గ్రహించిన ఫ్లిప్ కార్ట్.. “బిలియన్ కాప్చ్యూర్ ప్లస్” పేరిట సొంతంగా సెల్ ఫోన్లు తయారుచేసింది.
అలా తయారుచేసిన స్మార్ట్ ఫోన్లను ఈనెల 15నుంచి సైట్ లో అమ్మకానికి పెడుతోంది. దేశంలో విస్తృతంగా అమ్ముడుపోతున్న రెడ్ ఎమ్ఐ ఫోన్లకు పోటీగా తమ ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నామని ఓపెన్ గానే ప్రకటించింది ఫ్లిప్ కార్ట్.
కేవలం ఎల్ఈడీ టీవీలు, స్మార్ట్ ఫోన్లకు మాత్రమే పరిమితం అవ్వాలనుకోవట్లేదు ఫ్లిప్ కార్ట్. త్వరలోనే వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, మైక్రో వొవెన్స్, హోమ్ థియేటర్లను కూడా తమ సొంత బ్రాండింగ్ తో విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. డెహ్రాడూన్ లో ఇప్పటికే ప్రారంభించిన ఉత్పత్తి కేంద్రాన్ని మరింత విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సో.. ఇకపై ఫ్లిప్ కార్ట్ అనేది కేవలం ఆన్ లైన్ సైట్ మాత్రమే కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్.