ఇలాంటి బ‌యోపిక్ లు ఎంత‌మందికి సాధ్యం?

బ‌యోపిక్ లు అంటే మార్కెట్ లో ప్ర‌త్యేక‌మైన క్రేజ్. అందులోనూ సెల‌బ్రిటీల జీవిత క‌థ‌లంటే మ‌రింత ఆస‌క్తి క‌నిపిస్తుంటుంది. తాజాగా మ్యూజిక్ లెజెండ్ ఇళ‌య‌రాజా జీవిత క‌థ‌కు కూడా అంకురార్ప‌ణ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇళ‌య‌రాజా పాత్ర‌లో ధ‌నుష్ ని తీసుకుని అరుణ్ మాథేశ్వ‌రన్ తెర‌కెక్కించే బాధ్య‌త‌లు తీసుకున్నారు. ఇక ఈ సినిమాకి నేరుగా ఇళ‌యారాజానే సంగీతం అందించ‌డం మ‌రో గొప్ప విశేషం అని చెప్పాలి. త‌న క‌థ‌కు తానే సంగీతం వ‌హించ‌డం అన్న‌ది ఎక్క‌డో గానీ జ‌ర‌గ‌దు.

ఇలాంటి అవ‌కాశం ఎవ‌రికోగానీ ద‌క్క‌దు. ఆ ఛాన్స్ ఇళ‌య‌రాజాకి మాత్ర‌మే ద‌క్కింది. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇళ‌య‌రాజా ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దేశం గ‌ర్వించ‌ద‌గ్గ గొప్ప సంగీత ద‌ర్శ‌కుడిగా సేవ‌లందించారు. 1000 చిత్రాల‌కు పైగా బాణీలు స‌మ‌కూర్చిన ఓ లెజెండ్. అలాంటి లెజెండ‌రీ జీవితం వెండి తెర‌కు ఎక్క‌డ‌మే ఎంతో గొప్ప విష‌యం అనుకుంటే? అంత‌కు మించి త‌న క‌థ‌కి తానే సంగీతం అందించ‌డం అన్న‌ది ఇంకెంత విశేషం.

ఇక ఈ సినిమా కోసం ఇళ‌య‌రాజా ఆయ‌న కంపోజ్ చేసిన ఎన్నో ర‌కాల ట్యూన్స్ కూడా వాడ‌బోతు న్నారుట‌. ఆయ‌న జీవితంలో సంగీతం అణువ‌ణువునా ఉంది కాబ‌ట్టి క‌థ ప్రారంభం ద‌గ్గ‌ర నుంచి ముగింపు వ‌ర‌కూ సంగీతం మారుమ్రోగుతూనే ఉంటుంది. ఆయ‌న జీవితం మొత్తాన్ని సంగీతంలో చూపించ‌బోతున్నారు.

బాల్యం నుంచి ఆయ‌న జీవితం ఎలా సాగింది? సంగీత ద‌ర్శ‌కుడిగా ఎదిగిన వైనం? జీవితంలో ఒడిదు డుల‌కు ప్ర‌తీది క‌ళ్ల‌కు క‌ట్ట‌బోతున్నారు. ఈ సినిమా క‌థ ..క‌థ‌నాల్లో కూడా ఇళ‌య‌రాజా పాల్గొన‌డం విశేషం. ప్ర‌పంచ వ్యాప్తంగానే ఆయ‌న ఎన్నో క‌చేరీలు నిర్వ‌హించారు. వివిధ యూనివ‌ర్శీటీల నుంచి డాక్ట‌రేట్లు పొందారు. ఇక అవార్డులు..రివార్డుల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న అందుకోని అవార్డు అంటూ లేదు. ఆయ‌న సేవ‌ల్ని గుర్తించి ప్ర‌భుత్వం ఎన్నో పుర‌స్కారాల‌తో స‌త్క‌రించింది.