ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పుడే దీని ప్రభావం తగ్గే అవకాశాలు ఏమీ కనిపించడంలేదు. దీంతో ప్రభుత్వాలు నిధుల కోసం కటకటలాడుతున్నాయి. కేంద్రం సైతం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధుల్లో కోత పెడుతోంది. ఓవైపు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటం.. మరోవైపు సంక్షేమ పథకాల అమలుకు భారీ స్థాయిలో నిధులు అవసరం కావడం వంటి పరిణామాలు రాష్ట్రాలకు ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.
ఈ నేపథ్యంలో ఆదాయం సమకూర్చుకోవడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఆదాయ పెంపునకు ఉన్న మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించారు. మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన అధికారులతో సమావేశమై దీనికి సంబంధించి చర్చించారు. త్వరలోనే బాదుడు ప్రోగ్రాం షురూ కానున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఆర్టీసీని నష్టాల బారి నుంచి తప్పించే ఉద్దేశంతో ఆర్టీసీ చార్జీలు పెంచారు. అలాగే ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీల పెంపునకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలాగే ఆస్తి పన్ను పెంపుపైనా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అయితే, ఆస్తి పన్ను సరిగా వసూలు కావడంలేదని, ముందు అది వంద శాతం వసూలయ్యేలా చూడాలని నిర్ణయించారు.
దీంతోపాటు భూముల రిజిస్ట్రేషన్ విలువలు కూడా సవరించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ప్రతి రెండేళ్లకోసారి రిజిస్ట్రేషన్ విలువలు సవరించడం ఆనవాయితీ. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ఆరేళ్లుగా వాటి విలువలు సవరించలేదు. తాజాగా వాటిని సవరించడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని అధికారులు సీఎంకు చెప్పినట్టు సమాచారం. దీనికి కేసీఆర్ వద్దని అనలేదని.. అంటే, త్వరలోనే అన్ని రకాల బాదుడులూ మొదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇప్పటికిప్పుడు ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో సీఎం ఈ దిశగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఏపీలో మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇదే తరహాలో ముందుకెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.