మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది స్వాతంత్య్ర సమరయోధుడు ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి పీరియడ్ ఫిల్మ్ లో కనిపించి తెలుగు రాష్టాల్లో రికార్డ్స్ కొల్లగొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన మరో పీరియడ్ ఫిల్మ్ లో కనిపించనున్నారు. మీరు విన్నది నిజమే కానీ, ఈ సారి ఆయన యుద్దాలు పోరాటాలు చేసే పీరియడ్ ఫిల్మ్ చేయడంలేదు.
అసలు విషయంలోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి – బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘ఆచార్య’. ఈ పేరు ఇప్పటి వారికి పెద్దగా టచ్ లో లేని, వాడుకలో లేని పేరు, కానీ ఇదే టైటిల్ ని చిరు టీం ఎంచుకోవడానికి కారణం మేము ఎక్స్ క్లూజివ్ గా తెలుసుకున్నాం.. ‘ఆచార్య’ ఒక పీరియడ్ ఫిల్మ్. మీరు విన్నది నిజమే.. ‘ఆచార్య’ కథ ప్రస్తుతంలో జరగదు, 1990 బ్యాక్ డ్రాప్ లో కథ మొత్తం జరుగుతుంది. 1990ల బ్యాక్ డ్రాప్ లో దేవాలయాల విషయంలో జరిగిన ఓ సోషల్ క్రైమ్ ని బేస్ చేసుకొని ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఇటీవల లీకైన చిరు స్టిల్ కూడా అప్పటి లుక్ ని తలపించేలా ఉండడమే మీకు చక్కటి ఉదాహరణ..
ఇదొక పీరియడ్ ఫిల్మ్ కావడం వలనే హీరోయిజం ఎలివేట్ అయ్యే మరో పాత్ర కోసం అప్పట్లో మంచి రెబల్స్ అయిన నక్సలైట్ పాత్రని మొదటగా రామ్ చరణ్ కి డిజైన్ చేశారు. కానీ రామ్ చరణ్ కి కుదరకపోవడంతో మహేష్ బాబు లైన్ లోకి వచ్చాడు. దాంతో మహేష్ కోసం అప్పట్లో క్రేజ్ ఉన్న స్టూడెంట్ లీడర్ పాత్రగా మార్చారు. మరి మహేష్ ఈ సినిమా చేస్తారా? లేదా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
1990 బ్యాక్ డ్రాప్ కావడం వలన ప్రతి సెట్ ని అప్పటి వాతావరణాన్ని తలపించేలా ఉండాలని ఎక్కువ టైం తీసుకొని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కోకాపేటలో వేసిన ఓ సెట్లో జరుగుతోంది. హైదరాబాద్ లో అన్ని షెడ్యూల్స్ పూర్తయ్యాక ఫైనల్ అండ్ లాంగ్ షెడ్యూల్ కోసం శ్రీకాకుళం వెళ్లనున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్.