ఎగ్జిబిటర్ల సోమ్ము 40 కోట్లు డెడ్?

ఇండస్ట్రీలో లక్కీ ఫెలో ఎవరు అంటే దిల్ రాజు పేరు టక్కున చెప్పేస్తారు. ఏడాదిలో ఆరు సినిమాలు తీసిన నిర్మాత ఎవరు వున్నారు. మొన్నటి కాలంలో లేరు, నిన్నటి కాలంలో లేరు, కానీ ఇప్పుడు దిల్ రాజు వున్నారు. అందుకే ఆయనను లక్కీ పెలో అంటారు. కానీ ఆయనకు కూడా అన్ లక్కీ వుంది. పంపిణీ రంగంలో మాత్రం ఆయనకు నష్టాలు తప్పడం లేదు. అందులో ఈ ఏడాది మరీ ఘోరంగా వుంది పరిస్థితి.

జనాల దృష్టిలో దిల్ రాజే అన్నింటికీ అయినా, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వేరు. ప్రోడక్షన్ కంపెనీ వేరు. ప్రొడక్షన కంపెనీ లాభాల్లో వుంటే, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 40కోట్ల అప్పుల్లో వుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఇవేవీ ఫైనాన్స్ అప్పులు కావు. బ్యాంక్ లోన్లు కావు. సినిమాల కోసం థియేటర్లు ఇచ్చిన అడ్వాన్స్ లు.

కానీ సినిమాలు అనుకున్న రేంజ్ లో ఆడక, అడ్వాన్స్ లు కొంత వెనక్కు ఇవ్వాలి. అలా ఇవ్వకుండా వుండిపోయిన అమౌంట్ 40కోట్ల దాకా వుంటుందని టాక్ వినిపిస్తోంది. అంటే ఎగ్జిబిటర్ల డబ్బులు దిల్ రాజు సంస్థ దగ్గర వుండిపోయిన మొత్తం ఈ మేరకు వుంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే అంత అమౌంట్ డెడ్ అయిపోయిందన్నమాట.

ఇది వెనక్కు ఇవ్వడం వుండదు. దిల్ రాజు సినిమాలు పంపిణీకి ఇవ్వడం వాటిలో అడ్వాన్స్ ల కన్నా ఎక్కువ వస్తే అది అడ్జస్ట్ చేసుకోవడం అన్నమాట. అందుకే ఇక భవిష్యత్ లో దిల్ రాజు పంపిణీకి సినిమాలు తీసుకునేటపుడు ఆచి తూచి వ్యవహరించాలని డిసైడ్ అయినట్లు బోగట్టా.

నైజాం వరకు చూసుకుంటే ఆసియన్ సునీల్ ది పై చేయిగా వుంది. దీనికి కారణం హైదరాబాద్, సికింద్రబాద్ జంట నగరాల్లో థియేటర్లలో అధికశాతం ఆయన కంట్రోల్ లో వున్నాయి. దిల్ రాజు కంట్రోల్ లో వున్నవి తక్కువ. పైగా ఆసియన్ సునీల్ సినిమాలు కొనరు. అడ్వాన్స్ ల మీద ఆడించేవే ఎక్కువ. ఒకటీ అరా కొన్నా, వాటిల్లో బయటవారు పార్టనర్స్ గా వుండేలా చూసుకుంటారు. అందువల్ల సునీల్ కు నష్టాలు తక్కువ.

అందుకే మొత్తం మీద ప్రొడక్షన్ పెంచి, డిస్ట్రిబ్యూషన్ తగ్గించే ఆలోచనలో దిల్ రాజు వున్నట్లు ఇండస్ట్రీలో గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.