ఇండియన్ స్టాండప్ కమెడియన్ గా తన కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన 2024 ఇంటర్నేషనల్ ఎమ్మీకు హోస్ట్ గా మారాడు వీర్. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఇతని గురించే చర్చిస్తోంది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బుధవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ కు ఆతిథ్యం ఇవ్వనున్న తొలి భారతీయుడిగా వీర్ పేరు మారుమోగుతోంది.
ఎమ్మీ అవార్డులు ఈసారి నవంబర్లో న్యూయార్క్ వేదికగా అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఈ అవకాశం పై స్పందించిన వీర్..ఇటువంటి ఛాన్స్ దక్కడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఇక సోషల్ మీడియాలో ఇతనికి ఎంతోమంది అభినందనలు తెలియజేశారు. వీటిపై స్పందిస్తూ’మీరు కురిపిస్తున్న ఈ అభిమానానికి ఎంతో గౌరవంగా భావిస్తున్నాను..’అంటూ పోస్ట్ పెట్టాడు.
వీర్.. అదేనండి వీర్ దాస్ తన కెరీర్ ను ఒక స్టాండ్ కమెడియన్ గా ప్రారంభించి మెల్లిగా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. అతను స్వదేశంలోనే కాకుండా విదేశా వేదికలపై కూడా పలు ప్రదర్శనలు ఇచ్చాడు.’ఢిల్లీ బెల్లీ’, ‘గో గోవా గాన్’,’బద్మాష్ కంపెనీ’వంటి హిందీ చిత్రాల ద్వారా తన కామెడీతో ,మంచి పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.
‘వీర్ దాస్: అబ్రాడ్ అండర్‌స్టాండింగ్’ , ‘ వీర్ దాస్: ఫర్ ఇండియా’, ‘ల్యాండింగ్’ వంటి నెట్‌ఫ్లిక్స్ కామెడీ స్పెషల్స్ అతనికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకువచ్చాయి. 2023లో ‘వీర్ దాస్: ల్యాండింగ్’ అనే వెబ్ షోలో అతని కామెడీ కి ఎమ్మీ అవార్డు కూడా వచ్చింది. దీంతో ఎమ్మీ అవార్డును అందుకున్న మొదటి భారతీయ కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిగో ఇప్పుడు వీటన్నిటి పుణ్యమా అంటూ గత సంవత్సరం ఏ అవార్డు అయితే అందుకున్నాడు ఇప్పుడు ఈ ఇయర్ అదే అవార్డు ఫంక్షన్ కి పోస్ట్ గా వెళ్తున్నాడు.