కరోనా వైరస్ దెబ్బకు దేశాలకు దేశాలు వణికిపోతున్నాయి. ఇండియాలో పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో త్వరలోనే అత్యవసర పరిస్థితి తలెత్తేలా ఉంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 50కి చేరువ అవుతుండటం గమనార్హం.
ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న కేరళ లాంటి రాష్ట్రాలు స్కూళ్లు, థియేటర్లను మూసేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలు కాకుండా జనాలు వేల సంఖ్యలో ఒకచోటికి చేరేది ఆటలు చూసేందుకే. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్‌లు ఉన్నాయంటే స్టేడియాలు నిండిపోతాయి. అందులోనూ ఐపీఎల్ టీ20 టోర్నీకి ఉండే క్రేజ్ ఎలాంటిదో.. ఆ మ్యాచ్‌లు చూసేందుకు జనాలు ఎలా ఎగబడతారో తెలిసిందే.
ఈ నెల 29న ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభం కావాల్సి ఉండగా.. సమయం దగ్గర పడేసరికి పరిస్థితుల్ని బట్టి ప్రభుత్వం ఆ టోర్నీకి బ్రేక్ వేసే అవకాశాలు కొట్టిపడేయలేమని అంటున్నారు విశ్లేషకులు. ఐపీఎల్‌కు ఇంకో రెండు వారాల పైగానే సమయం ఉండగా.. ఈ కాలంలో కరోనా వైరస్ కేసులు పెరిగి, అత్యవసర పరిస్థితి తలెత్తితే.. ఐపీఎల్ నిర్వహణకు ప్రభుత్వం బ్రేక్ వేస్తుందని అంటున్నారు. టోర్నీని వాయిదా వేయడమో.. లేదంటే పూర్తిగా రద్దు చేయడమో.. లేదా మరో దేశంలో నిర్వహించుకోవాలని సూచించడమో చేస్తుందని అంటున్నారు.
ఐతే చాలా దేశాల్లో కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో గతంలో మాదిరి దక్షిణాఫ్రికాలోనో, దుబాయిలోనో టోర్నీని నిర్వహించే అవకాశం లేదు. ఇప్పటికిప్పుడు, ఈ పరిస్థితుల్లో సన్నాహాలు కూడా కష్టమే. ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించి కేవలం టీవీ ప్రేక్షకుల్ని అలరిస్తే చాలనుకుంటే అలా టోర్నీని నడిపించడానికి అవకాశముంది. ఏదేమైనప్పటికీ ఇంకో పది రోజుల్లో ఐపీఎల్ జరుగుతుందా లేదా అన్నదానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.