ఒక్క ఛాన్స్ అడిగాడు.. నట్టేట ముంచాడు!

ఏపీలో స్థానిక సంస్థల సమరానికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ.. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. తాజాగా ఎన్నికల ప్రచార పత్రం విడుదల చేసి సమర శంఖం పూరించింది. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ఒక్క అవకాశం అడిగితే ఇచ్చారని, మరి కోరుకున్నదేంటి? దక్కిందేంటి అని ప్రశ్నించింది.

ఒక్క ఛాన్స్ అడిగి నట్టేట ముంచాడని, విధ్వంసం చేశాడని మండిపడింది. పది నెలలైంది.. ఒక్క నిమిషం.. పది అంశాలపై ఆలోచించి మనసు పెట్టి ఓటు వేయాలని కోరింది. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల తగ్గించడం దగ్గర నుంచి వివిధ వర్గాలకు ఇచ్చే కానుకలు ఎత్తివేయడం, అమరావతి, పోలవరం భవిష్యత్తు అంధకారంలో పడేయడం, నిత్యావసరాల ధరలు పెంచేయడం, నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం, 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఆర్థిక సాయం ఎగవేయడం, రైతులకు రూ.80వేల వరకు ఎగనామం పెట్టడం వంటి అంశాలను ఆ ప్రచార పత్రంలో పొందుపరిచింది.

అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలనే లక్ష్యంలో రూపొందించిన ఈ ప్రచార పత్రంలో అంత సత్తా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గడానికి టీడీపీ నేత హైకోర్టుకు వెళ్లడమే అనే విషయాన్ని అధికార పార్టీ బాగానే ప్రజల్లోకి తీసుకెళ్లింది. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే తాము చాలా ఎన్నికల హామీలు అమలు చేశామని, టీడీపీలా ఎన్నికలకు ఆరు నెలల ముందు కాదని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

బీసీ కోటా తగ్గడానికి కారణం మీరేనని, అలాంటిది తిరిగి మా పై బురద చల్లుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఉగాది రోజును దాదాపు 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నామని, ఆ దెబ్బతో టీడీపీ పని ఖతం కావడం ఖాయమని వారు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రచారాన్ని జనం ఏ విధంగా స్వీకరిస్తారో తెలియాలంటే కొన్ని రోజలు ఆగక తప్పదు.