ఓర్రీ ధ‌రించిన వాచ్ ఖ‌రీదుతో ఇల్లు కొనొచ్చు

బాలీవుడ్ యువ‌క‌థానాయిక‌లతో నైట్ పార్టీల్లో మునిగి తేల్తుంటాడు ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్ర‌త‌మ‌ణి. అత‌డికి సినీఇండ‌స్ట్రీతో ఉన్న స‌త్సంబంధాలు, స్టార్ల ఫాలోయింగ్ అన్నివేళ‌లా చ‌ర్చ‌నీయాంశం. ముఖ్యంగా గాళ్స్ లో అత‌డి ఫాలోయింగ్ చూస్తే చాలా మంది కుళ్లుకుంటారు. అందుకే అత‌డు ఎక్క‌డ ఉన్నా ఏ పార్టీలో త‌ల‌మున‌క‌లుగా ఉన్నా మీడియాకు సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్ గా క‌నిపిస్తున్నాడు. ఇటీవ‌ల అత‌డు ప‌లు పార్టీల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి.

మొన్న‌టికి మొన్న అంబానీల పెళ్లిలో ఓర్రీ సెల‌బ్రేష‌న్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, వీడియోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయ్యాయి. అత‌డి జీవ‌న శైలి అన్నివేళ‌లా ఆస‌క్తిని క‌లిగిస్తుంది. అత‌డి ఫ్యాష‌న్ ఎంపిక‌లు స్టైల్ ఐకాన్ గా నిల‌బెట్టాయి. ఇప్పుడు మ‌రొక కార‌ణంతో అత‌డు మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చాడు. ఓర్రీ రూ. 20 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన వాచ్‌ను ప్రదర్శించాడు. ఈ విలాసవంతమైన యాక్సెసరీ, సెర్పెంటి మిస్టెరియోసి హై జ్యువెలరీ కలెక్షన్ నుంచి సేక‌రించిన‌ది. 18 కెటి తెలుపు -పసుపు బంగారం, బ్రిలియంట్-కట్ డైమండ్‌లు, రెండు పియర్-కట్ పచ్చలు, పేవ్-సెట్ డైమండ్ డయల్‌తో వాచ్ మెస్మ‌రైజ్ చేస్తోంది.

ఓర్రీ ఖ‌రీదైన ఆభ‌ర‌ణాల‌తో క‌నిపించ‌డం ఇదే తొలిసారి కాదు. అతడు గతంలో రూ. 4.3 కోట్ల విలువైన సర్పెంటి డైమండ్ నెక్లెస్‌తో వార్తల్లో నిలిచాడు. హై ఎండ్ ఫ్యాషన్ యాక్సెసరీస్ పై అతడి ప్రవృత్తి యువ‌త‌రాన్ని విశేషంగా ఆక‌ర్షిస్తుంది. తరచూ బాలీవుడ్ ప్రముఖులతో ఈవెంట్‌లలో స‌రికొత్త ఫ్యాష‌నిస్టాగా త‌న‌ని తాను ఎలివేట్ చేసుకునే తీరు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. ఆకర్షణీయమైన జీవనశైలితో పాటు, ఓర్రీ తన వృత్తిపరమైన నేపథ్యంతోను చాలా పాపుల‌ర‌య్యాడు.

అవ్ర‌త‌మ‌ణి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. న్యూయార్క్‌లోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుండి ఫైన్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.4 మిలియన్ల మంది అనుచరులను క‌లిగి ఉన్నాడు. అతడు సినిమా ప్రీమియర్‌లు, ట్రావెల్ అడ్వెంచర్ లు సహా తన జీవితంలోని చాలా విశేషాల‌ను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తుంటాడు. ఇప్పుడు వజ్రాలు పొదిగిన వాచ్‌తో అతడి విలాసాల జీవితం గురించి మ‌రింత అవ‌గాహ‌న వ‌చ్చింది. ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో అత‌డు ట్రెండ్ సెట్ట‌ర్ గా మారేందుకు నిత్య‌నూత‌న విధానాల‌ను అనుస‌రిస్తున్నాడు. ఓర్రీ నైట్ పార్టీలు, ఫంక్ష‌న్ల‌కు హాజ‌రైనందుకు అహూతుల‌ను ఎంట‌ర్ టైన్ చేసినందుకు ల‌క్ష‌ల్లో పారితోషికాలు అందుకుంటున్నాడ‌ని కూడా ప్ర‌చారం సాగింది. బ‌హుశా అత‌డి అపార సంప‌ద‌లు, భారీ ఆదాయం ఖ‌రీదైన జీవ‌న శైలికి కార‌ణం కావొచ్చు. ఇప్పుడు ఓర్రీ ధ‌రించిన వాచ్ ఖ‌రీదుతో ఇల్లు కొనొచ్చు! అంటూ అభిమానులు స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు.