ప్రశాంత్ కిశోర్ అంటే కేవలం ఎన్నికల వ్యూహకర్త మాత్రమే కాదు. ఆయన రాజకీయ నాయకుడుగా కూడా అవతరించి.. చాన్నాళ్లయింది. రాజకీయ అవతారంతో పాటుగా సహజంగానే వివాదాలు కూడా ఆయన వెన్నంటి ఉన్నాయి. ఆయన ప్రధాన ఫోకస్ ఉన్న రాజకీయ క్షేత్రం బీహార్. బీహార్లో 15 ఏళ్లుగా అప్రతిహతంగా ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్న నితీశ్ కుమార్ కు మొన్నమొన్నటిదాకా ఆయన వారసుడు. తనతో రక్తసంబంధంలేని వ్యక్తి ప్రశాంత్ కిశోర్ ను వారసుడిగా ప్రకటించి.. నితీశ్ నిన్నటికి ఒక సంచలనం సృష్టిస్తే ఇవాళ్టికి ఆ పార్టీనుంచి వెలివేయబడ్డ సదరు వారసుడు, నితీశ్ మీదనే కత్తులు దూస్తున్నాడు.
నితీశ్ కుమార్- ప్రశాంత్ కిశోర్ ల మధ్య బంధం చాన్నాళ్ల కిందటే చెడింది. భాజపా అనుకూల వైఖరిని పీకే వ్యతిరేకించినందువల్ల ఆయన పార్టీలోంచి బయటకు రావాల్సి వచ్చింది. భాజపా మైత్రిని వదులుకోవడానికి నితీశ్ ఇష్టపడలేదు. ఇటీవలి పరిణామాల్లో ఎన్నార్సీకి వ్యతిరేకంగా బీహార్ అసెంబ్లీ తీర్మానం చేసినప్పటికీ.. సీఏఏ విషయంలో మాత్రం భాజపానే సమర్థించింది. రెండు రోజుల కిందట నితీశ్ ఓ సభలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కూటమి బీహార్ లో రెండు వందల అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటుందని ప్రకటించారు.
ఈ కాన్ఫిడెన్స్‌పై నిన్నటిదాకా నితీశ్ వారసుడిగా చెలామణీ అయిన పీకే.. విమర్శలు గుప్పిస్తున్నారు. 200సీట్లు గెలుచుకోవడం సంగతి తర్వాత.. కానీ.. పదిహేనేళ్ల తన సుదీర్ఘ పాలనలో బీహార్ ఇంకా పేద రాష్ట్రంగానే ఎందుకు ఉండిపోయిందో నితీశ్ ముందు ప్రజలకు సమాధానం చెప్పాలంటూ నిలదీస్తున్నారు. అదే సమయంలో సీఏఏ మీద కూడా ముఖ్యమంత్రి నితీశ్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 48 మంది ఢిల్లీ అల్లర్లలో చనిపోతే.. వారిగురించి సీఎం నితీశ్ కనీసం మాట్లాడకపోవడం బాధాకరం అంటూ దెప్పిపొడుస్తున్నారు.
ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అక్కడి ప్రతిపక్ష పార్టీలకు వ్యూహకర్తగా ఒప్పందాలు చేసుకుని భాజపా వ్యతిరేక కృషి చేస్తున్నారు. అదే సమయంలో ఆయన తృణమూల్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు వెళ్లవచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది. కాగా, వచ్చే ఏడాదిలో తన సొంతరాష్ట్రం బీహార్ కు జరిగే అసెంబ్లీ ఎన్నికలకోసం పీకే ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘బాత్ బీహార్ కీ’ అనే కార్యక్రమంతో ఆయన బీహార్ ను దేశంలో టాప్ టెన్ రాష్ట్రాల్లో ఒకటిగా తయారుచేస్తాం అంటున్నారు