కమల్‌ అప్పుడు కూతురు కోసం, ఇప్పుడు..!

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ మల్టీ టాలెంటెడ్‌ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన కమల్‌ హాసన్ నిర్మాతగా, దర్శకుడిగా కూడా సినిమాలు చేసి మెప్పించాడు. ఇక కమల్‌ లో రచయిత కూడా ఉన్నాడు, ఆ రచయిత అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాడు.

ఆ మధ్య శృతి హాసన్‌ స్వీయ దర్శకత్వంలో నటించిన ఇనిమెల్‌ మ్యూజికల్‌ వీడియో కోసం కమల్‌ హాసన్ సాహిత్యంను అందించాడు. ఈతరం యువత ఆలోచనలు ప్రతిభింబించే విధంగా ఆ మ్యూజికల్ వీడియో ఉంటుంది. దానికి తగ్గ సాహిత్యంను అందించడంలో కమల్‌ సక్సెస్ అయ్యాడు.

ఆ మ్యూజిక్‌ ఆల్బం కి కమల్‌ అందించిన సాహిత్యం కు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో దర్శకుడు మణిరత్నం పట్టుబట్టి మరీ కమల్‌ హాసన్‌ తో థగ్‌ లైఫ్‌ సినిమా కోసం ఒక పాటను రాయించాడని సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన వార్తలు తమిళ మీడియాలో ప్రధానంగా వస్తున్నాయి.

ఇటీవలే థగ్‌ లైఫ్‌ కోసం కమల్‌ రాసిన పాటను ఏఆర్‌ రెహమాన్ ట్యూన్ తో రికార్డ్‌ చేయడం జరిగిందని తెలుస్తోంది. ఈ పాట సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు, తమిళ సినీ వర్గాల వారు కూడా ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.

మూడు దశాబ్దాల తర్వాత కమల్‌ మరియు మణిరత్నం కాంబోలో సినిమా వస్తుంది. థగ్‌ లైఫ్ అనే భిన్నమైన టైటిల్‌ ను ఈ యాక్షన్‌ మూవీకి పెట్టడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించారు. మణిరత్నం మరో విజయాన్ని కమల్‌ కు అందించడం ఖాయంగా అంతా నమ్ముతున్నారు.

విక్రమ్‌ తర్వాత వరుసగా హిట్స్ కొట్టాలని పట్టుదలతో ఉన్న కమల్‌ కి భారతీయుడు 2 తో ఎదురు దెబ్బ తగిలింది. కల్కి సూపర్‌ హిట్‌ అయినా కమల్‌ అందులో కనిపించింది నామమాత్రంగానే, అందుకే థగ్‌ లైఫ్‌ హిట్ కోసం ఆయన ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.