బాహుబలి తర్వాత ప్రభాస్ మళ్లీ తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు చేసిన సినిమా కల్కి 2898 ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజువల్ వండర్ గా వరల్డ్ సినీ లవర్స్ కి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని అంటున్నారు. రిలీజ్ ఇంకా 3 రోజులే ఉన్న సందర్భంగా చిత్ర యూనిట్ భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. రీసెంట్ గా కల్కి టీం ముంబైలో రిలీజ్ ట్రైలర్ వదలగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ టైం లోనే ప్రభాస్ కల్కి టీం తో ఆ సినిమాలో నటించిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు.
కల్కి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను ఈ ఇంటర్వ్యూలో తెలియచేశారు. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకొనేతో పాటుగా నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ లు కూడా ఈ ఇంటర్వ్యూలో భాగం అయ్యారు. ఇలాంటి గొప్ప సినిమాను ఇద్దరు మహిళలు నిర్మించడం నిజంగా అభినందనీయమని అమితాబ్ అన్నారు. సినిమా ఎలా మొదలైంది అన్న విషయాన్ని చెబుతూ నాగ్ అశ్విన్ కథ చెప్పినప్పుడే రెండు రోజులు మామూలు మనిషిని కాలేకపోయానని ప్రియాంక దత్ అన్నారు.
ఈ సినిమాలో తను భాగమైనందుకు సంతోషంగా ఉందని అన్నారు అమితాబ్. సినిమాలో తన పాత్ర కోసం 3 గంటల దాకా మేకప్ వేసుకున్నానని గుర్తు చేసుకున్నారు. ప్రభాస్ తో తన ఫైట్స్ ఉన్నాయని ఆయన ఇండియన్ సూపర్ స్టార్.. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ తనను క్షమించాలని అన్నారు అమితాబ్. ఐతే అందుకు ప్రభాస్ కూడా వాళ్లంతా మీ ఫ్యాన్స్ కూడా సార్ అని అన్నాడు.
ఇక కమల్ హాసన్ కూడా కల్కి సినిమాకు పనిచేయడం పై తను పొందిన అనుభూతిని పంచుకున్నారు. కథ పేపర్ మీద ఉండటం వేరు తెర మీద కనిపించడం వేరు. నాగ్ అశ్విన్ ఒక అద్భుతమైన కథ రాసుకున్నాడు కానీ ఎలా తీస్తాడన్న డౌట్ కలిగింది. కానీ అమితాబ్ సార్ సీన్స్ చూశాక నమ్మకం కలిగిందని అన్నారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ టైం లో తనని బాగా నచ్చిన మరో అంశం షూటింగ్ అంతా చాలా ప్రశాంతంగా ఎలాంటి అనవసరమైన హడావిడి లేకుండా జరిగింది. యూనిట్ అంతా కూడా చాలా డిసిప్లే గా ఉన్నారు అది తనకు బాగా నచ్చిందని అన్నారు కమల్.
కల్కి సినిమాలో నటించడం పట్ల ప్రభాస్ తన ఎక్స్ పీరియన్స్ చెబుతూ.. కల్కి కథ చెప్పినప్ప్డు తన పాత్ర చాలా ఎగ్జీట్ అనిపించింది. కథ విన్న వెంటనే ఓకే చేశానని అన్నారు ప్రభాస్. కల్కిలో హీరోయిన్ గా నటించిన దీపిక కూడా ఆమె అనుభూతిని పంచుకుంటూ సినిమాలో ప్రతి సీన్ నాగ్ అశ్విన్ ముందే తన మైండ్ లో చూసేశాడని.. దాన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారని అన్నారు. కమల్ సార్ తో షూట్ జరిగిన టైం లో తనకు ఫోన్ చేసి ఒక చిన్నపిల్లాడిలా ఎగ్జైట్ అయ్యాడని దీపిక అన్నారు.
ఐతే ఈ సినిమా ఇంత బాగా రావడానికి నాగ్ అశ్విన్ కథ దర్శకత్వం మాత్రమే కాదు ఇందులో మీలాంటి వారంతా భాగం అవ్వడమే అని అన్నారు నిర్మాత స్వప్న దత్. ప్రీ ప్రొడక్షన్ టైం లోనే సినిమా చాలా గొప్పగా తీయాలని భావించామని.. రాసిన ప్రతి పాత్రకు పర్ఫెక్ట్ కాస్టింగ్ తో సినిమా తెరకెక్కించామని అన్నారు. అంత వర్క్ అవుట్ చేసి కష్టపడ్డారు కాబట్టే కల్కి సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.