కామినేని అంటే ప్రత్యేకమైన ప్రేమ ఎందుకో?

కొందరు నాయకులకు ప్రత్యేకంగా కాలం కలిసి వస్తూ ఉంటుంది. తాము కడిగిన ముత్యాల వంటి వాళ్లం అని చంద్రబాబు తర్వాత తనంత నిజాయితీ పరుడు మరొకడు ఉండరని చెప్పుకుంటూ ఉంటారు. వారి వారి శాఖల్లో ఎన్ని రకాల అవినీతి బాగోతాలు జరిగిపోతున్నాయో.. తిమింగలాలు వెలుగుచూస్తున్నాయో.. బహిరంగంగానే జరుగుతూ ఉంటుంది.

దీనికి సంబంధించిన సమాచారం మొత్తం ఓపెన్ సీక్రెట్ లాగా దొరికిపోతూ ఉంటుంది. కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం తమకేమీ కనపడనట్లుగా వ్యవహరిస్తాయి. తాను కూయకపోతే తెల్లారదని నమ్మే కోడిపుంజులాగా.. కొన్ని మీడియా సంస్థలు తాము ప్రచురించకపోతే.. ఆ అవినీతి బాగోతాలు ప్రజల దృష్టికి వెళ్లకుండా మరుగున ఉండిపోతాయనే భ్రమలో బతుకుతూ ఉంటాయి.

ఇప్పుడు మంత్రి కామినేని వ్యవహారంలో కూడా ఒక అగ్రశ్రేణి మీడియా సంస్థ ఇలాంటి వల్లమాలిన ప్రేమను ప్రదర్శిస్తున్నట్లుగా కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీకి చెందిన మంత్రి కామినేని వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో విశాఖ పట్టణంలో ఏర్పాటు చేయదలచుకున్న మెడ్ టెక్ జోన్ కు సంబంధించిన టెండర్ల బాగోతం ఎంతటి ప్రకంపనాలు సృష్టిస్తోందో అందరికీ తెలుసు. 700కోట్ల విలువైన దీనిని ఏకంగా 2000 కోట్లకు పెంచేయడం.. తదనంతర పరిణామాలు సంస్థకు చెందిన కొందరే.. ప్రెస్ మీట్ లు పెట్టి.. ఆధారాల సహా వివరాలు వెల్లడించడం.. అయినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం. ఇటీవల ఎస్క్రో ఖాతా లేదంటూ.. పాత టెండర్లను రద్దుచేసి కొత్తగా మళ్లీ టెండర్లు పిలవడం వరకూ అనేక పరిణామాలు జరిగాయి.

అయితే అవినీతి వ్యవహారానికి తెరతీశారని ఎదుర్కొంటున్న పాత టెండరు విషయంలో దాన్ని రద్దు చేసిన రోజే.. ఆ సంస్థకు దాదాపు 11 కోట్ల పైచిలుకు మొత్తం ప్రభుత్వం నుంచి చెల్లించినట్లుగా దొరికిన ఆధారాలు ఇప్పుడు ప్రభుత్వం మెడకు చుట్టుకుంటున్నాయి. ఇదంతా కామినేని శాఖకు సంబంధించిన వ్యవహారం. ఏ పద్దు కింద ఈ 11 కోట్లరూపాయలను ఇచ్చారు. మతలబు లేంటి అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నిజానికి జూడిష్ రాజు అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మంత్రి కామినేని కి ప్రత్యక్షంగా ఈ అవినీతితో భాగం ఉందని వెల్లడించినప్పుడే.. రాద్ధాంతం జరగాల్సింది.

కానీ మీడియా మద్దతుతో మంత్రిగారు సేఫ్ జోన్ లోనే ఉండిపోయి, పాత టెండరు సంస్థకు రూపాయి ఇవ్వాలేదని అంటూ వచ్చారు. అయితే తాజాగా 11 కోట్లపైగా , టెండరు రద్దయిన రోజు చెల్లించినట్లు వార్తలు ‘కేవలం కొన్ని పత్రికల్లోమాత్రం’ వచ్చాయి. నిత్యం సత్యాన్నే నినదింపజేసే అగ్రశ్రేణి దినపత్రిక మాత్రం ఈ వ్యవహారం తమకేమీ తెలియనట్లు, పట్టనట్లు మౌనం పాటించేసింది. తాను కూయకపోతే తెల్లారదని అనుకునే కోడి లాగా.. ఈ సంస్థ కూడా.. తాను వేయకపోతే.. మంత్రి అవినీతి గురించి ప్రజలు తెలుసుకోలేరని భావిస్తున్నట్లుందని పలువురు అనుకుంటున్నారు.